'స్వామి రారా' చిత్రంలో విలన్లు: నిజ జీవితంలో 'విదేశీ పక్షి' పేరుతో మోసం
హైదరాబాద్: కామెరూన్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు మోసం చేయబోయి పోలీసుల చేతికి చిక్కారు. నిజానికి వారిద్దరు చదువు కోవడానికి హైదరాబాద్‌కు వచ్చారు. 2012లో విడుదలైన తెలుగు సినిమా ‘స్వామిరారా'లో విలన్ పాత్రలు పోషించారు.
నిజ జీవితంలో కూడా సినిమాలో మాదిరిగా మోసం చేయబోయి పోలీసులకు చిక్కారు. విదేశీ పక్షులు అమ్ముతామని ఆన్‌లైన్ ద్వారా ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న అలెక్స్ రాడ్‌రీగూ ఎబోకో (27), నడిమ్ అబాకే మాథ్యు (31)లను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి మే 5వ తేదీన ఒక జత విదేశీ పక్షులు (మాకాస్) రూ.1.50 లక్షలకు అమ్మకానికి ఉన్నట్లు మెయిల్ వచ్చింది. అదే రోజు నిందితుల నుంచి ఫోన్ వచ్చింది. వారు సూచించిన మేరకు పక్షులను డెలివరీ చేయడానికి అడ్వాన్సుగా రూ.50 వేలను నిందితుల ఖాతాలో డిపాజిట్ చేశాడు. విమాన చార్జీల పేరుతో మరింత డబ్బు కావాలని నిందితులు డిమాండ్ చేశారు.

దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి మోసం బయటపడింది. డిగ్రీ చదవడానికి మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన నిందితులిద్దరూ ‘స్వామి రారా' చిత్రంలో నటించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఆన్‌లైన్ మోసాలకు శ్రీకారం చుట్టారు.
వీరి బారిన పడ్డవారిలో ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రూ.40 వేల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, యాపిల్ నోట్ ప్యాడ్, 7ఫోన్లు, 9 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications