ఉదయ్‌పూర్ కన్నయ్యలాల్ హత్య: హైదరాబాద్ పాతబస్తీలో మరో నిందితుడి అరెస్ట్, ఎన్ఐఏ దర్యాప్తు
హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో జరిగిన టైలర్ కన్నయ్యలాల్ హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యకేసులో అనుమానితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి ఖలందర్ నగర్ ప్రాంతంలోని లక్కీ హోటల్‌కు ఎన్‌ఐఏ బృందం చేరుకున్నట్లు తెలిసింది. కన్హయ్య లాల్ హత్యలో నిందితులతో సంబంధం ఉన్న బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఇక్కడ ఉంటున్నట్లు సమాచారం.

ఉదయ్‌పూర్‌లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతిస్తున్నారనే ఆరోపణలతో దర్జీని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులతోపాటు వారి సహచరులైన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
మాకు తెలిసిన వివరాల ప్రకారం.. NIA బృందం ఉదయపూర్ కేసుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి గురించి కొంత సమాచారాన్ని కలిగి ఉంది. అతని కోసం వెతుకుతోంది. అతని అరెస్టు లేదా నిర్బంధం గురించి మాకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు అని హైదరాబాద్ సిటీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
NIA నుంచి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, గత సాయంత్రం నుంచి, కొంతమంది సాధారణ దుస్తులు ధరించిన పోలీసులు ఈ ప్రాంతంలో రెక్సీ నిర్వహించి, ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు కనిపించారు అని స్థానిక వర్గాలు తెలిపాయి.