అంతా శుభం జరగాలి: మేమే అధికారంలోకి రావాలి
Lok Sabha elections in Telangana 2024: నేడు శ్రీ క్రోధి నామ ఉగాది పండగ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైభవోపేతంగా ఈ పర్వదినాన్ని జరుపుకొంటోన్నారు. తెల్లవారు జాము నుంచి ఆలయాన్నీ సందడిగా మారాయి. భక్తుల రద్దీ నెలకొంది. దాదాపు అన్ని ఆలయాల్లోనూ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నారు.
ఉగాదిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. అటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఎదుర్కొంటోన్న నేపథ్యంలో కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. మామిడి తోరణాలను కట్టారు.

పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి దంపతులు సహా పలువురు పార్టీ నాయకులు, పదాధికారులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉగాది సందర్భంగా యాగాన్ని నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలతో పార్టీ కార్యాలయం మారుమోగింది. కిషన్ రెడ్డి, ఆయన భార్య కావ్య దగ్గరుండి ఈ యాగ క్రతువును పూర్తి చేశారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశ ప్రగతి, అభివృద్ధి కోసం బీజేపీకి పట్ట కట్టడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి నాయకత్వం వహిస్తారని, అన్ని రంగాల్లోనూ ప్రపంచలోనే అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా చోటు దక్కదని పేర్కొన్నారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన నాలుగో విడతలో పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా అదే రోజు ఒకేదశలో పోలింగ్ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications