బోయిన్ పల్లి స్కూల్ లో గుట్టు చప్పుడు కాకుండా ధందా
హైదరాబాద్ బోయిన్‌పల్లిలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్ పల్లిలోని మేధా హైస్కూల్‌లో ఈగల్ టీమ్ భారీ డ్రగ్స్ రాకెట్‌ను భగ్నం చేసింది. దీని గుట్టు రట్టు చేసింది. మూసివేసిన ఈ ప్రైవేట్ పాఠశాలలో పెద్ద ఎత్తున అల్ఫ్రాజోలమ్ ను తయారు చేస్తోన్నట్లు తేలింది. మేధా హైస్కూల్ భవనాన్ని రహస్యంగా నార్కోటిక్స్ కేంద్రంగా మార్చారని ఈ దాడుల్లో వెల్లడైంది. ఈ ఆపరేషన్‌లో, ఈగల్ బృందం ముగ్గురిని అరెస్టు చేసింది. వారిలో పాఠశాల యజమాని కూడా ఉన్నాడు.
ఈ సందర్భంగా సంఘటన స్థలం నుంచి 21 కోట్ల రూపాయల విలువైన 3.5 కిలోల అల్ఫ్రాజోలమ్ తో పాటు 21 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ 21 లక్షల రూపాయలు కూడా కేవలం రెండు రోజుల్లోనే అల్ఫ్రాజోలమ్ ను విక్రయించడం ద్వారా సంపాదించినట్లుగా ఈగల్ టీమ్ నిర్ధారించింది. అరెస్టు అయిన వారిలో పాఠశాల యజమాని జయప్రకాష్ గౌడ్, డ్రైవర్ పీ ఉదయ్ సాయి, ట్రాన్స్‌పోర్టర్ జీ మురళి ఉన్నారు.

స్కూల్ ప్రధాన భవనం వెనుక ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించారు. దీని సెల్లార్‌ను అల్ఫ్రాజోలమ్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రసాయనాల డ్రమ్ములు, స్టవ్, డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగించే చిన్న రియాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రియాక్టర్ ఒకేసారి 5 కిలోల అల్ఫ్రాజోలమ్‌ను ఉత్పత్తి చేయగలదని అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం- జయప్రకాష్ గతంలో మహబూబ్‌నగర్‌లో కల్లు వ్యాపారం చేసేవాడు.
జిల్లాలో పలు కల్లు కాంపౌండ్‌లకు అల్ఫ్రాజోలమ్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీనికి మంచి డిమాండ్ లభిస్తోండటంతో ఈ మధ్యకాలంలోనే పెద్ద ఎత్తున అల్ఫ్రాజోలమ్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మేధా హైస్కూల్ ఆవరణలోనే దీని తయారీ కేంద్రాన్ని నెలకొల్పాడు. చట్టవిరుద్ధమైన ఉత్పత్తికి ఉపయోగించే రసాయనాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తోన్నారు.
బీ2బీ, బీ2సీ మాదిరిగా అనేక కంపెనీలు ఈ డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను సరఫరా చేసి ఉండొచ్చని ఈగల్ టీమ్ అనుమానిస్తోంది. ప్రధాన నిందితుడు జయప్రకాష్ ఈ డ్రగ్స్ ధందాను ఎంతకాలం నుంచి నడిపిస్తోన్నాడు?, ఈ నెట్ వర్క్ తో సంబంధం ఉన్న వాళ్లెవరు? ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అయ్యాయా? అనే వివరాలపై కూపీ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications