కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం: తొలి కేంద్రమంత్రిగా రికార్డ్
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి(UN) ప్రధాన కార్యాలయం వేదికగా జులై 10 నుంచి 14 వరకు జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన వక్తగా ప్రసంగించే అవకాశం కిషన్ రెడ్డికి లభించింది. ఇప్పటి వరకు ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి కావడం విశేషం. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ఆయనకు ఆహ్వానం పంపింది.
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో కిషన్ రెడ్డి.. వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గ్లోబల్ టూరిజం డెవలప్‌మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.

భారతదేశంలో జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా.. జీ-20 దేశాల టూరిజం చైర్ హోదాలో కిషన్ రెడ్డి ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహ్వానిత సభ్యదేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ నేపథ్యంలోనే పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను ఏకం చేయాల్సిన ఆవశ్యకత థీమ్‌తో జులై 13, 14 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా, వివిధ దేశాల ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశ ప్రతిష్ట దశదిశలా వ్యాపించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలలో టూరిజం పాత్రను గుర్తిస్తూ UNWTOలో నిర్వహించే సమావేశంలో చర్చలు జరగనున్నాయి. పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడంపై అగ్ర దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను ఒకే చోటకు చేర్చనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా టూరిజం, ఎస్‌డీజీల మధ్య సంబంధాలను కూడా బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోంది.












Click it and Unblock the Notifications