కేసీఆర్ సర్కారును తరిమికొడితేనే.. వారి త్యాగానికి నిజమైన నివాళి: కేంద్రమంత్రులు
నల్గొండ: కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రులు మాట్లాడారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హత్యలు, అత్యాచారాలకు ప్రతి రూపం టీఆర్ఎస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీ పీఠం ఎక్కుతా అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటికీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

తెలంగాణ కోసం ఉద్యమించినవారంతా ప్రస్తుతం ఎక్కడికి పోయారని కిషన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు.
మరో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఆదేశాలతోనే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినవారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనని అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications