మాధవరెడ్డి విగ్రహానికి నిప్పు: రాస్తారోకో, క్షీరాభిషేకం చేసిన సతీమణి
హైదరాబాద్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో దారుణం జరిగింది. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న దివంగత టీడీపీ నేత ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో విగ్రహం పాక్షికంగా దహనమైంది.
ఈ క్రమంలో గురువారం గ్రామానికి వచ్చిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఘటనకు అధికార పార్టీ టీఆఎసే బాధ్యత వహించాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీవి దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శమని తెలిపారు.
నల్గొండ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మాధవరెడ్డి విగ్రహ దహనం సంఘటనకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ ఘటనపై తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేతల ప్రమేయంతోనే నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి దుండగలు నిప్పుపెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మాధవరెడ్డి పేరు ప్రతిష్టలు భరించలేని కేసీఆర్ ప్రభుత్వం, ఆయన కీర్తిని తగ్గించాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందని అన్నారు.
ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం ‘ఆపార్డ్' కు ఆయన పేరును తొలగించిందని మండిపడ్డారు. మాధవరెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను 24 గంటల్లోపు అరెస్ట్ చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications