తెలంగాణాను టెన్షన్ పెడుతున్న వరుణుడు.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!
ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్నా వర్షాలు మాత్రం వదలడం లేదు. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావంతో వరద బారినపడి విలవిలలాడిన తెలంగాణ జిల్లాలు ఇంకా కోలుకోకముందే మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఈ జిల్లాలలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
ఈ తేమ గాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేకచోట్ల భారీ వర్షం
ఇక నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరంగల్ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో అనేక రహదారులు జలమయంగా మారి పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇప్పటికే మొంథా తుఫాను గ్రేటర్ వరంగల్ ను ముంపు బారిన పడేసి తీవ్ర నష్టం చేకూర్చింది.
ఎనుమాముల మార్కెట్ లో తడిసిన పత్తి, మొక్కజొన్న
ప్రస్తుతం ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు సర్వేలు చేస్తున్నారు. మళ్లీ ఇదే సమయంలో వర్షం కురుస్తూ ఉండడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈరోజు ఉదయం నుంచి వరంగల్, హనుమకొండ , జనగామ జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. కాగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రైతులు విక్రయానికి తెచ్చిన పత్తి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తడిసిన పంటలు కొనుగోలు చెయ్యాలని రైతుల వినతి
ఆరుగాలం శ్రమించి మార్కెట్ దాకా పంటను తెచ్చి అమ్ము కుందాం అనుకున్న సమయంలో మార్కెట్లో పంట అంతా నీళ్ల పాలు కావడం తో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను కొనుగోలు చేస్తే తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు












Click it and Unblock the Notifications