అవినీతి, అహంకారం: కేసీఆర్‌పై ఉత్తమ్ నిప్పులు, ప్రజాగర్జనకు రాహుల్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: మూడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అహంకారానికి టీఆర్ఎస్ ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే గోబెల్స్‌ ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేతల మనిషి కాదని.. మాటల మనిషేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్‌1న సంగారెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.

 Uttam Kumar Reddy lashes out at KCR government

ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్క ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ఈ ప్రజాగర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యలు మీ పాలనలో కాదా? అని ప్రశ్నించారు.

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. బీజేపీ తమవి గొప్ప సిద్ధాంతాలంటూ ప్రతీ ఇల్లూ తిరుగుతూ కాంగ్రెస్ నేతలను ప్రలోభపెడుతోందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరడం లేదని, కొందరు బీజేపీ సీనియర్ నేతలే కాంగ్రెస్ పార్టీలో చేరతామంటున్నారని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Congress Party president Uttam Kumar Reddy on Wednesday lashed out at Telangana CM K Chandrasekhar Rao's government.
Please Wait while comments are loading...