అదే జరిగితే యుద్ధం జరగొచ్చు, నేను రెడీ: ఉత్తమ్, మోడీకి మద్దతిద్దాం: కాంగ్రెస్
హైదరాబాద్: పాకిస్తాన్‌లో సుస్థిర ప్రభుత్వం లేకపోవడం, సైన్యం చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మ కావడం వల్ల ఆ దేశం నుంచి ప్రతిదాడి జరిగే అవకాశముందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. పాక్ మళ్లీ దాడులకు దిగితే అది యుద్ధానికి దారి తీసే అవకాశముందన్నారు.
పాక్‌కు దౌత్య సంబంధాలు నెరపడం రాదన్నారు. ఇప్పటికప్పుడు యుద్ధం జరక్కపోయినా యావత్తు దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. తాను మాజీ సైనిక అధికారిగా రిజర్వ్‌లో ఉన్నానని యుద్ధం అనివార్యమైతే తనకు సమాచారం ఇస్తారన్నారు. సైన్యం నుంచి పిలుపు వస్తే యుద్ధంలో తప్పకుండా సేవలు అందిస్తానని చెప్పారు.

ఓయూలో సంబరాలు
పాక్ ఉగ్రవాదుల పైన సైన్యం చర్యలను హర్షిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏబీవీపీ సంబరాలు నిర్వహించింది. భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. ఉగ్రవాదంపై ఇంకా పోరు జరపాలని, ఎప్పుడు ఇలాంటి దురాక్రమనలకు ఒడిగట్టకుండా తగిన బుద్ధి చెప్పాలని ఆకాంక్షించారు.
పాక్ వైఖరిని ఎండగట్టాలి: రఘువీరా
ఉగ్రవాదుల పైన భారత్ సైన్యం మెరుపుదాడులు చేయడం అభినందనీయమని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలన్నీ విభేదాలు పక్కన పెట్టి సైనిక దాడి విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాలన్నారు. యావత్ భారత దేశం సైనికులకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
సైనికులకు మద్దతుగా శనివారం విశాఖలో ఏపీసీసీ ఆధ్వర్యంలో జై జవాన్, జై భారత్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత దేశ సార్వభౌమ్యాధికారానికి భంగం వాటిల్లితే సమర్థంగా తిప్పికొడతామని సైనికులు నిరూపించారన్నారు. పాక్ వైఖరిని ఎండగట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.












Click it and Unblock the Notifications