Valentines Day 2025: రేపే ప్రేమికుల దినోత్సవం.. కానీ లవర్స్ కు స్వీట్ వార్నింగ్
Valentines Day 2025: ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే.. ప్రేమికులకు అతిపెద్ద పండగ రోజు అని అందరికి తెలిసింది. ప్రేమికుల రోజున చాలా మంది లవర్స్ కలిసిపోతూ ఉంటారు. మరెన్నో జంటలు తమ ప్రేమను ఒక వేడుకలా జరుపుకుంటాయి. ఈ ప్రత్యేకమైన రోజున వారి వారి లవర్స్ కు ప్రత్యేకమైన బహుమతులు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రేమికుల రోజున లవర్స్ కు ఓ భయం మాత్రం ఉంటుంది. ఆ భయమే భజరంగ్ దళ్. ఫిబ్రవరి 14న పార్కుల్లో ప్రేమ జంటలు కనిపస్తే చాలు.. చేతికి తాళిబొట్టు ఇచ్చి మరీ బలవంతంగా పెళ్లిళ్లు చేయించేస్తారనే వాదన ఇప్పటికి కూడా ఉంది. వాలెంటైన్స్ డే రోజున భజరంగ్ దళ్ పేరు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికులకు మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రేమికుల రోజును నిషేధించాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రకటించారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తామేమని పెళ్లిళ్లు చేసే కార్యక్రమాలు పెట్టుకోలేదని.. ఫిబ్రవరి 14 అంటే పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుని వీర జవాన్ దివస్ గా నిర్వహించడమే తమ లక్ష్యమని భజరంగ్ దళ్ నేతలు పేర్కొన్నారు. పుల్మామాలో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. "బ్యాన్ వాలెంటైన్స్ డే.. ప్రమోట్ వీర జవాన్ దివస్" అంటూ వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతలు నినాదాలు ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే పేరిట పబ్బుల్లో, హోటళ్లలో, పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని పలు పబ్బుల్లో యువతను ప్రేమికుల రోజు ఆఫర్ల పేరిట ఆకర్షిస్తున్నారని.. ఇది మన సంస్కృతి కాదని వారు స్పష్టం చేశారు. ఎవరైనా ప్రేమ పేరిట బయట విచ్చలవిడిగా తిరిగితే ఊరుకోమని.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని వదిలిపెట్టమని భజరంగ్ దళ్ కార్యకర్తలు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రేమికుల రోజును బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications