కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఏదో ఫ్లోలో అనేశాను: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదో ఫ్లోలో అనే అనేశాను.. మేము ఆయన్ను గౌరవిస్తాం.. అసెంబ్లీకి రమ్మనండి.. అసెంబ్లీకి వస్తే ఆయన్ను మేము కూడా గౌరవిస్తాం అని స్పష్టం చేశారు. ఆయన చనిపోవాలని తాము నిజంగా కోరుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదే విషయంపై మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ మార్గదర్శకత్వంలో సేవ చేయాలని కోరుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి చావు కోరుకోదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలాగే బీఆర్ ఎస్ ప్రస్తావించాల్సిన అంశాలను స్పీకర్ కు సరైన రూపంలో ఇవ్వాలని మంత్రి తెలిపారు. అసభ్య పదజాలానికి సంబంధించి సభలో ఆమోదించే ప్రసక్తే లేదన్నారు.
ఇదే విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనారోగ్యం బారిన పడాలని.. హరీష్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని స్వయంగా కేసీఆర్ కుమార్తె చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం చెడిపోతే.. తాను లబ్ది పొందవచ్చు అనే ఉద్దేశంతోనే హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నట్లు కవిత చెప్పారని.. ప్రతిపక్ష నాయకుడి చావు కోరుకోవడం తమ పార్టీ విధానం కాదని.. ఆయన క్షేమంగా ఉండాలని తాము ఎల్లప్పుడూ కోరుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, దిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని.. అలాంటి గొప్ప నాయకుడి చావు కోరే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు దిగజారారని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటిపై దాడికి చావు డప్పు కొడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులే ఎలా ఎస్కార్ట్ ఇచ్చారో వీడియోలతో సహా గవర్నర్ కు తెలియజేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications
