హైదరాబాద్‌కు అతి భారీ వర్ష హెచ్చరిక: రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, కూకట్‌పల్లి, బాచుపల్లి, సనత్ నగర్, ముషీరాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
రహదారులపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

మరోవైపు, మరో రెండు గంటల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-2111 1111 నెంబర్ ఏర్పాటు చేశారు.
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మెదక్‌లో 12 సెం.మీల వర్షం కురవడంతో పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. సిద్దిపేట 9 సెం.మీ, సంగారెడ్డిలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అత్యధికంగా 13.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చిగురుమామిడిలో అత్యంత వర్షపాతం 14 సెం.మీ నమోదైంది.
తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. శుక్రవారం అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications