ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయశాంతి .. హాజరైన సీఎం రేవంత్
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్‌కు నాలుగు, బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కనున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లను అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం ఖరారు అయ్యారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సహా పలువురు నేతలు హాజరయ్యారు.

తమకు వచ్చే నాలుగు సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సీపీఐ కోరగా, కొత్తగూడెం మాత్రమే కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్, సీపీఐ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంఐఎం పార్టీ మద్దతు ప్రకటించింది. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ హాజరయ్యారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications