పవన్‌కు పోటీగా అల్లు అర్జున్: రంగంలో దిగిన రియల్ హీరో
Allu Arjun: కనివినీ ఎరుగని విధంగా సంభవించిన విపత్తు.. రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేసింది. అతి భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
హైదరాబాద్ మొదలుకుని ఖమ్మం, మహబూబాబాద్ వరకు తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు వరదల బారిన పడ్డాయి. మున్నేరు వాగు.. ఓ చిన్నపాటి సముద్రాన్ని తలపించింది. పరీవాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. భారీ వర్షాల వల్ల మహబూబాబాద్ జిల్లా ఘోరంగా దెబ్బతిన్నది.

ఏపీలో కోస్తా తీర ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, విష్వక్‌సేన్, అనన్య నాగళ్ల, సిద్ధ జొన్నలగడ్డ, అశ్వనీదత్, త్రివిక్రమ్.. వంటి సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు.
తాజాగా అల్లు అర్జున్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళంగా ప్రకటించారు.
ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు మిగిల్చిన నష్టం తనను కలచివేశాయని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చేపడుతున్న సహాయ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రుల సహాయనిధికి మొత్తం కోటి రూపాయలను విరాళంగా ఇస్తున్నానని చెప్పారు.
బాలీవుడ్ హీరో సోనూ సూద్ కూడా స్పందించారు. వరదల్లో ఎలాంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా సూద్ ఛారిటీ ఫౌండేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫౌండేషన్ తరఫున అన్ని రకాల సహాయ, పునరావాస చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications