ఏపీ, తెలంగాణా వాసులకు పండుగే.. కొత్త రైల్వేలైన్ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైల్వే ప్రాజెక్టుల పైన ఫోకస్ చేసిన కేంద్రం, అనేక కొత్త ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అత్యధిక రద్దీగా ఉండే విజయవాడ-కాజీపేట రైల్వే మార్గంలో 219 కి.మీ. పొడవైన మూడో లైను నిర్మాణం చేపట్టింది.
విజయవాడ-కాజీపేట రైల్వే మూడవ లైన్
ప్రస్తుతం ఈ 3వ లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.1,952 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు ప్రయాణాలు వేగవంతం కానున్నాయి. ఇది ప్రయాణికులను చేరవేయటం మాత్రమే కాదు, సరుకు రవాణాకు కీలకంగా ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఈ కొత్త రైల్వే లైన్ లో 194 కి.మీ. పనులు పూర్తయ్యాయి.

డోర్నకల్-మహబూబాబాద్ మధ్య కొనసాగుతున్న పనులు
మిగిలిన 25 కి.మీ.డోర్నకల్-మహబూబాబాద్ మధ్య పనులను రెండు నెలల్లో పూర్తి చేసి మొత్తం లైనును వినియోగంలోకి తీసుకురానున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఇప్పటికే సిద్ధమైన 118 కి.మీ. ట్రాక్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల గ్రాండ్ ట్రంక్ రూట్‌పై రద్దీ భారీగా తగ్గుతుంది.
ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా సులభం
ప్రయాణికుల రైళ్ల వేగం పెరుగుతుంది, ఆలస్యాలు తగ్గుతాయి. సరకు రవాణా ముఖ్యంగా బొగ్గు, సిమెంటు రవాణా సులభం మరియు వేగవంతం అవుతుంది. తెలంగాణ నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, చెన్నై, తిరుపతి వంటి నగరాలకు వెళ్లే దూరపు రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. భవిష్యత్తులో అదనపు రైళ్లను నడపడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది పాత లైన్ల మీద ఉన్న రైళ్ళ రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది.
ఉత్తర భారత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యమైన కనెక్టివిటీ
విజయవాడ-కాజీపేట మార్గం ఉత్తర భారత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యమైన కనెక్టివిటీని అందిస్తుంది. దీనివలన ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ మూడో లైను వల్ల పారిశ్రామిక రవాణా మెరుగుపడి, తెలుగు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది. ఈ అభివృద్ధి రైల్వే రంగంలో కొత్త యుగానికి నాంది పలుకుతుంది.













Click it and Unblock the Notifications