గాలి వార్తలు నమ్మొద్దు: సొంతవాళ్లపై హరీష్ అసహనం
రంగారెడ్డి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ జిల్లాగా ఏర్పాటు అవుతుందని, దీని పైన గాలి వార్తలు నమ్మవద్దని, కేసీఆర్ మాట తప్పరని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సోమవారం అన్నారు. కేసీఆర్ ఆరునూరైనా కొత్తజిల్లాను ఏర్పాటుచేసి ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకుంటారన్నారు.
సోమవారం తాండూరు వెళుతూ మార్గమధ్యంలో స్థానిక అతిథి గృహం వద్ద ఆగారు. ఈ సందర్భంగా వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఫోరం(వీడీడీఎఫ్) ప్రతినిధులు ఆయనను కలిశారు. జిల్లా ఏర్పాటు విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పా రు. సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలు ఒకేసారి ఏర్పాటవుతాయని హామీ ఇచ్చారు. దీనిపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, తెలిసీతెలియని గాలి వార్తలను నమ్మొద్దన్నారు.
జిల్లా ఏర్పాటు అంశంపై వికారాబాద్ బంద్ వంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంపట్ల మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, అతిథి గృహం లోపల వినతిపత్రంతో తనను కలిసిన వీడీడీఎఫ్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త హామీ అయితే వినతిపత్రాన్ని స్వీకరించేవాడిననీ, పాత హామీకి కొత్తగా వినతిపత్రం దేనికని వారిని ప్రశ్నించారు.
సొంతపార్టీవాళ్లే ఇలా ఆందోళనకు దిగటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇకపై ఇలాంటివాటిని ఉపేక్షించేది లేదన్నారు. తాండూరులో మిషన్ కాకతీయపై మాట్లాడుతూ.. మీడియాలో వచ్చే కథనాలలో ఉత్తమమైన వాటిని ఎంపికచేసి రూ.లక్ష అవార్డు అందజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications