Viral Video: ఇంట్లో నక్కిన మొసలి..షాక్‌లో యజమాని..!
వనపర్తి: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేట్ గ్రామంలోని ఓ ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథిని చూసిన ఇంటి యజమాని నాగన్న షాక్‌కు గురయ్యాడు. ఆ అతిథి మరెవరో కాదు ఓ మొసలి. ఔను నేరుగా ఇంటి పక్కనే ఉన్న బాత్‌రూం దగ్గరకు ఆ మొసలి వచ్చి చేరింది.
జానంపేట్ గ్రామంలో నివాసం ఉంటున్న నాగన్న మంచి నిద్రలో ఉండగా వీధి కుక్కలు మొరుగడాన్ని గమనించాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున షుమారు 3:30 గంటలు. కుక్కలను తరుముదామని వెళ్లిన యజమాని నాగన్నకు పెద్ద మొసలి కంటపడింది. అంతే నాగన్న ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సాగర్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు చివరికి ఫలించి మొసలి పట్టుబడింది. వెంటనే దాన్ని బంధించి బీచుపల్లి వద్ద కృష్ణా నదిలోకి వదిలారు.

అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన ఆ మొసలి,గ్రామానికి సమీపంలో ఉన్న రామసముద్రం వాగు నుంచి వచ్చిఉంటుందని చెబుతున్నారు. మొసలి నీటి నుంచి ఒడ్డుకు రావడంతో వీధి కుక్కలు తరిమాయి. దీంతో ఆ మొసలి నాగన్న ఇంటిలోకి ప్రవేశించి బాత్రూం చాటున నక్కింది. నాగన్న డయల్ 100కు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన బీట్ కానిస్టేబుల్ రమేష్ హోంగార్డు కృష్ణ సాగర్‌లు అటవీశాఖ అధికారులతో నాగన్న ఇంటికి చేరుకున్నారు. మొదట మొసలి ముక్కును ఒక గోనెసంచితో కప్పి ఆపై తాడు కట్టారు.

మొసలిని బంధించిన తర్వాత గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో బీచుపల్లి వద్ద కృష్ణానదికి తీసుకుని అక్కడ వదిలారు. వర్షాకాలంలో కర్నాటక నుంచి ఆల్మటి, నారాయణపూర్ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నది దిగువకు ప్రవహించినప్పుడు సుమారు 300 నుంచి 400 మొసళ్లు కొట్టుకువస్తుంటాయని అధికారులు చెప్పారు. అలా కొట్టుకువచ్చిన మొసళ్లు తెలంగాణ ఆంధ్రా ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో తలదాచుకుంటూ ఉంటాయని వివరించారు. అంతేకాదు నదిలో నీటి మట్టం పెరిగిన తర్వాత మొసళ్లలాగే మచ్చల జింకలు, కృష్ణ జింకలు కూడా ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటాయని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications