కాంగ్రెస్ లోకి బీజేపీ బిగ్ షాట్స్ - బండికి బుజ్జగింపులు..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుటోంది. బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీలోని లుకలుకలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన కీలక నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. సీట్ల ఖరారుపై హామీ ఇస్తోంది. ఇదే సమయంలో బీజేపీలో టెన్షన్ మొదలైంది. బండి సంజయ్ సైతం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు.
బీజేపీకి భారీ షాక్..!:తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తప్పేలా లేదు. మాజీ ఎంపీలు రాజగోపాల్ రెడ్డి, వివేక్ ఇద్దరూ కాంగ్రెస్ లో చేరటం ఖాయమని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇదే విషయమై తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ లో తిరిగి చేరటంపై రాజగోపాళ్ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు వివేక్ కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరోలో ఉంటారని తెలుస్తోంది. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా వీరి బాటలో నడవనున్నారని తెలుస్తోంది. ఈ సమయంలోనే ఢిల్లీ నేతలు తెలంగాణ పరిణామాలపై ఆరా తీస్తున్నారు

కాంగ్రెస్ కొత్త వ్యూహం:బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తనకు (ఎల్‌బీనగర్), తన భార్య లక్ష్మికి (మునుగోడు) టికెట్లను రాజ్‌గోపాల్‌రెడ్డి ఆశించారు. కానీ నాయకత్వం ప్రకటించిన జాబితాలో ఆ స్థానాలతో పాటు వీరి పేర్లు చోటు చేసుకోలేదు. ఈటల రాజేందర్‌కు మాత్రం రెండు సీట్లలో (హుజూరాబాద్, గజ్వేల్) పోటీకి అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.
మరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. వీరిలో గతంలో రెండుసార్లు ఎంపీగా ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నేత అసెంబ్లీకి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినా బరిలో నిలవాల్సిందేనని నాయకత్వం ఒత్తిడి తేవడంతో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

సొంత గూటికి సీనియర్లు:కొంత కాలంగా నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న మరో మహిళా నేత కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండో జాబితా విడుదలలో జాప్యం చేయడం.. బీజేపీ నుంచి వచ్చే నేతల కోసమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీకి దింపడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అటు బండి సంజయ్ ను అసెంబ్లీకి పరిమితం చేయటం పైన ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఢిల్లీ నేతలు బుజ్జగింపులు ప్రారంభించారు. ఈ నెల 27న అమిత్ షా తెలంగాణ పర్యటనలో పార్టీలో పరిస్థితులు..జంపింగ్స్ నివారణ దిశగా చర్యలు తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications