జలదిగ్బంధం, నిలిచిన రాకపోకలు - రైల్వే తాజా నిర్ణయం..!!
మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల పై విరుచుకుపడింది. తీరం దాటిన తరువాత ఏపీలో పరిస్థితి మెరుగు అవుతుందనుకుంటున్న సమయంలో తెలంగాణ వణికిపోయింది. జోరువానతో వరంగల్, హన్మకొండ సహా పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికలతో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
మొంథా తుపాను దిశ మార్చుకుని తెలంగాణ పై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షపు నీరు పలు కాలనీలను ముంచెత్తింది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లలో కి చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హనుమకొండలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తున్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ములుగు వెళ్లే రోడ్డులో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. వర్షాల దృష్ట్యా వరంగల్ బల్దియా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1980 ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో ఎస్‌ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వరంగల్ డీఈవో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో సుమారు 2 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే తుఫాను కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసారు. సీఎం రేవంత్ సహాయక చర్యల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications