Warangal: నక్క తోక తొక్కిన వరంగల్ వాసులు..
తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అయితే తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా హైదరాబాద్ ఉంది. దీంతో అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇతర నగరాలను డెవలప్ మెంట్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. వరంగల్, కరీంనగర్ నగరాలను అభివృద్ధి చేస్తే హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతుంది. అయితే చాలా పార్టీలు వరంగల్, కరీంనగర్ డెవలప్ మెంట్ చేస్తామని చెబుతున్నాయి తప్పా.. చేతల్లో కనిపించడం లేదు.
తాజాగా రేవంత్ సర్కార్ వరంగల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఓరుగల్లును రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే వరంగల్ పంట పండినట్లే అక్కడి భూముల ధరలకు రెక్కలొస్తాయి. అంతే కాదు అక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వరంగల్ గురించి ఈ మధ్య రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఓరుగల్లు, హనుమకొండ అభివృద్ధిపై మంగళవారం మంత్రులు సమావేశం అయ్యారు. వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్‌లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. భేటీలో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని పొంగులేటి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గత జూన్‌లో వరంగల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంపై కూడా అధికారులతో చర్చించారు. వరంగల్ తో పాటు కరీంనగర్ కూడా అభివృద్ధి చేస్తే జంట నగరాలుగా మారే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications