కరీంనగర్‌లో దారుణం... మహిళా వైద్య సిబ్బందిపై వార్డు బాయ్ అత్యాచారయత్నం...
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా సిబ్బందిపై వార్డు బాయ్ అత్యాచారానికి యత్నించాడు. మెడికల్ స్టాక్ ఉన్న గదిలో యువతిని నిర్బంధించి అత్యాచారం చేయబోయాడు. బాధిత యువతి చాకచక్యంగా అతని నుంచి తప్పించుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది ఒకరు ఎప్పటిలాగే గురువారం(ఏప్రిల్ 22) విధులకు హాజరయ్యారు. విధుల్లో భాగంగా ఆమె ఆస్పత్రిలోని మెడికల్ స్టాక్ గదిలోకి వెళ్లగా... వార్డు బాయ్ గమనించాడు. ఆమె వెనకాలే ఆ గదిలోకి వెళ్లి తలుపు పెట్టాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే యువతి గట్టిగా ప్రతిఘటించి చాకచక్యంగా తప్పించుకుంది.

మరుసటిరోజు బాధితురాలి కుటుంబ సభ్యులు,బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆ వార్డు బాయ్‌ని చితకబాదారు. డే షిఫ్టులోనే మహిళా సిబ్బందికి రక్షణ లేకపోతే... ఇక నైట్ షిఫ్టులో మహిళల సంగతేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వార్డు బాయ్‌కి వైద్య అధికారుల అండదండలు ఉండటంతోనే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ఘటనలోనూ నిందితుడికి,బాధితురాలికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆస్పత్రి వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
కరోనా సమయంలో ప్రాణాలను రిస్క్ చేసి మరీ పేషెంట్లకు సేవలందిస్తుంటే... ఇలా మహిళా వైద్యులపై అఘాయిత్యాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళా వైద్యులపై లైంగిక దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కరీంనగర్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళా కోవిడ్ పేషెంట్‌పై వార్డు బాయ్ అత్యాచారానికి యత్నించాడు. పేషెంట్ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించడంతో అక్కడినుంచి పారిపోయాడు.అయితే వైద్య సిబ్బందే అతను పారిపోయేందుకు సహకరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడం గమనార్హం.












Click it and Unblock the Notifications