"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ?
హైదరాబాద్ నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక అలర్ట్ జారీ చేసింది. మంజీరా ఫేజ్-3 ప్రాజెక్టుకు సంబంధించిన పెద్దాపూర్ పంప్ హౌస్‌లో చేపడుతున్న అత్యవసర మరమ్మతుల పనుల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్టు ప్రకటించింది. పాత మౌలిక సదుపాయాలను మార్చి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
పంప్ హౌస్‌లో ఆధునికీకరణ పనులు..
కాగా పెద్దాపూర్ పంప్ హౌస్‌లో గత 35 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పాత హెచ్‌టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో అత్యాధునిక ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల పంపింగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడంతో పాటు భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు వెళ్లే 1600 ఎంఎం భారీ పైప్‌లైన్‌లో ఉన్న ఎయిర్ వాల్వ్‌లను కూడా మార్చుతున్నారు. అదే విధంగా 2000 ఎంఎం పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను కూడా కొత్తవిగా మార్చే పనులు చేపట్టారు. ఈ పైప్‌లైన్‌లు నగరానికి తాగునీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నందున వాటి నిర్వహణను మెరుగుపరచడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..
ఈ మరమ్మతుల పనులు మార్చి 7 శనివారం ఉదయం 8 గంటల నుంచి మార్చి 8 ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయి. మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ పనుల కారణంగా నగరంలోని మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, షేక్‌పేట్ పరిధిలోని కాలనీలకు నీటి సరఫరా ఉండదని.. అలాగే భోజగుట్ట ప్రాంతంలో మాత్రం చాలా తక్కువ పీడనంతో మాత్రమే నీటిని విడుదల చేస్తారని తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే తాగునీరు నిల్వ చేసుకోవాలని వాటర్ బోర్డు అధికారులు సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం స్థానిక జలమండలి కార్యాలయాలను సంప్రదించవచ్చని తెలిపారు. పనులు పూర్తయ్యిన వెంటనే నీటి సరఫరాను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ రెండు రోజుల పాటు నీటి కొరత వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలగవచ్చని అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ నగర నీటి వ్యవస్థను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈ పనులకు ప్రజలు సహకరించాలని వాటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications