అసెంబ్లీలో రేవంత్ సర్కారును నిలదీస్తామన్న కేటీఆర్
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అస్థిత్వంపై అవగాహన లేకుండా.. బాధ్యతారాహిత్యంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తోందని.. ప్రజల ఆవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలుస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై అసెంబ్లీ, మండలిలో నిలదీస్తామన్నారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరతను ప్రశ్నించారు. సర్పంచులు, మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు.

పల్లెప్రగతి ద్వారా దేశంలో అత్యుత్తమ గ్రామాలుగా తెలంగాణ గ్రామాలు నిలిచినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు పల్లె అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు కేటీఆర్. దళితబంధు పథకం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అందుకే చెల్లింపులు జరగడం లేదన్నారు.
రైతుబంధు రెండో విడత నిధుల విడుదల ఆలస్యం రైతుల కష్టాలను పెంచిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, లక్ష కోట్ల బడ్జెట్ వంటి హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీపైనా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆయా వర్గా ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలని, అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు కేసీఆర్. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.












Click it and Unblock the Notifications