తెలంగాణకు చల్లని కబురు, ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. చక్రవాత ఆవర్తనం, క్యుములో నింబస్ మేఘాల వల్ల బుధవారం, గురువారం రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారంనాడు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటు ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది ఇలావుండగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని పేర్కొంది. పలుచోట్ల పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఏప్రిల్ 9 నుంచి 12 వరకు వర్షాలతో ప్రభావితమయ్యే జాబితాలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, యానాం, కేరళ, మాహే, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న కొన్ని రోజుల పాటు తూర్పు, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో పలుచోట్ల బలమైన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం బిహార్, జమ్మూకాశ్మీర్‌లలో పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications