అరగంట వర్షానికే అల్లాడిన హైదరాబాద్ సిటీ: రోడ్లపైకి వరద, ఇళ్లల్లోకి బురద
హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. ఒక్కసారిగా వర్షం దంచి కొట్టడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన నగరవాసులు వానలో తడిసి ముద్దయ్యారు. అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ భారీ వర్షంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం
మరోవైపు, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షంలో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది.
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చేరిన వరదనీరు
ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులకు గత కొన్ని రోజులుగా ఉన్న వేడి వాతావరణం నుంచి కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని ఫలక్‌నుమా, కాలాపత్తర్, చాంద్రాయణగుట్ట బహదూర్‌పురా, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, వికారాబాద్ ప్రాంతాల్లోనూ వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
బెంగళూరు పరిస్థితి అలా.. హైదరాబాద్‌లో ఇలా..
కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్, నాచారం, కాప్రాలోనూ భారీ వర్షం పడింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షంలో బయటికి వచ్చే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బెంగళూరులో కురిసిన వర్షాలు, వరదల గురించి టీఆర్ఎస్ నేతలు మట్లాడుతున్నారని.. కానీ, అరగంట వర్షానికే హైదరాబాద్ పరిస్థితి ఇలా మారిందంటూ టీఆర్ఎస్ సర్కారుపై పలువురు నెటిజర్లు మండిపడుతున్నారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు
ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఎల్లుండి అంటే గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ఆవర్తన ప్రభావంతో తదుపరి 48గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications