తెలంగాణ బలం ఏమిటో వెల్లడించిన రేవంత్ రెడ్డి: గేమ్ ఛేంజర్ రోల్..
దేశ 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ రాణిమహల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, సమ్మాన్ గార్డ్స్ కవాతు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని బలంగా విశ్వస్తానని, సంకల్పం ఉందని అన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రసంగం.. ఆయన మాటల్లోనే..
- అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ సమగ్రాభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం పనిచేద్దాం.
- అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం.
- అభివృద్ధి, సంక్షేమం అన్న ద్విముఖ విధానంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని ప్రజా ప్రభుత్వం ఎంచుకుంది. పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ 20 నెలల కాలంలో రాష్ట్రాన్ని దేశానికి రోల్ మాడల్‌గా నిలబెట్టాం.

- పేదల ఆహార భద్రతకు భరోసాగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాం. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేపట్టాం. నిరుపేదల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే పథకంతో పేదల కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం శాశ్వతంగా గుర్తుంటుంది. అలాగే ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం.
- వరంగల్ వేదికగా 2022 మే 6న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర సృష్టించాం. రైతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12 వేల చొప్పున జూన్ 16 న కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించాం. దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా తెలంగాణ రైతాంగాన్ని ప్రోత్సహించాం.
- పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 22,500 కోట్లను వెచ్చిస్తున్నాం.
- ఎంతో శ్రమకోర్చి శాస్త్రీయమైన, ఎంతో లోతైన కసరత్తు చేసి సామాజిక తెలంగాణ సాధన కోసం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ద్వారా ఆమోదించాం. ఆ బిల్లులను కేంద్ర ప్రభుత్వం సత్వరం ఆమోదించాలని కోరుతున్నాం.
- అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. సామాజిక తెలంగాణకు పునాది వేసిన రోజు ఫిబ్రవరి 4 వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని నిర్ణయించాం.
- తెలంగాణ బలం హైదరాబాద్. ఆ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయడానికి పలు అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించాం. మిస్ వరల్డ్, వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సదస్సు, గ్లోబల్ రైస్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు వంటివి నిర్వహించాం. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చుకుంటున్నాం.
- శాంతి భద్రతలు రాష్ట్ర ప్రగతికి కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతుందంటే అందుకు మన పోలీసు వ్యవస్థ కారణం. వారికి అభినందనలు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరుంది.
- అన్ని వేదికల నుంచి తెలంగాణ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేశాం. Telangana Rising 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ లో ఆవిష్కరించబోతున్నాం. దేశ స్వాతంత్య్రం సిద్ధించి శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న విజన్‌తో నిరంతరం శ్రమిస్తున్నాం.
- దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు నుంచి తెలంగాణ గ్రామీణ వ్యవసాయ వికాసం వరకు విజన్‌లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించాం.
- రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టు, మెట్రో విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డును కలిపే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు వంటి లక్ష్యాలతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళికే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్.












Click it and Unblock the Notifications