సంక్షేమ పథకాల్లో అక్రమ లబ్ధిదారులకు రికవరీ నోటీసుల నిలిపివేత
సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన, పొందుతోన్న అనర్హులకు నోటీసులివ్వడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధిపొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, త్వరలోనే అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని పేర్కొంది. మార్గదర్శకాలు వచ్చే వరకూ రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ శాంతి కుమారి అధికారులకు సూచించారు.
అనర్హులకు లబ్ధి, రికవరీపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించనిట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేసే చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అర్హత లేకపోయినప్పటికీ ఆసరా పింఛన్లు, రైతుబంధు పొందారంటూ ఇటీవల ఇచ్చిన రికవరీ నోటీసులు వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం, జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ సంక్షేమ పథకాల్లో కొందరు అనర్హులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై వివిధ స్థాయిల్లో చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం గుర్తించిన లోపాలు వాటిని ఎలా సరిదిద్దాలని అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని సీఎస్ తెలిపారు. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేరడంతో పాటు ఇప్పటివరకు అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ చేయడంపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ క్రమంలో మార్గదర్శకాలు జారీ అయ్యే వరకు రికవరీ కోసం నోటీసులు, ఇతర చర్యలు చేపట్టరాదని కలెక్టర్లు, ఇతర అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.












Click it and Unblock the Notifications