మీ ఓటు ఎవరైనా వేస్తే, డోన్ట్ వర్రీ - ఇలా మీ ఓటు వేయండి..!!
ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లకు కొంత గందరగోళం తప్పటం లేదు. తమ పేరు ఓటర్ల లిస్టులో లేకపోవటం. ఓటర్ స్లిప్ అందకపోవటం. తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో వేయాలో తెలియకపోవటం. తమ ఓటు వేరే వాళ్లు వేయటం. ఇలాంటి వాటికి ఎన్నికల సంఘం కొన్ని పరిష్కారాలు చూపిస్తోంది. అయితే, తమ ఓటు వేరే మరొకరు వేసారంటే ఓటరు ఆగ్రహంతో వెనక్కు వెళ్లిపోతారు. కానీ, అలా జరిగిన సమయంలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుంది.
ఎవరైనా తమ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికే వారి ఓటు పోల్ అయి ఉంటే ఎలా పొందాలో నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఏ కారణాల చేతనైనా ఓటు హక్కు కోల్పోతే 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49 (పి) అవకాశం కల్పిస్తోంది. సెక్షన్ 49 (పి) ద్వారా ఓటు తిరిగి పొందవచ్చు. అయితే ముందు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తిని తానేనని అధికారి ముందు నిరూపించుకోవాలి. అందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎన్నారైలైతే పాస్‌పోర్టు చూపించాలి.

అటు తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17 (బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. అనంతరం టెండర్డ్ బ్యాలెట్ పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి మనకు ఇస్తారు. అటు తర్వాత మనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి తిరిగి అధికారికి పత్రాన్ని ఇచ్చేయాలి. సెక్షన్ 49 (పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు అనుమతి ఇవ్వరు. కేవలం పోస్టల్ బ్యాలెట్‌కు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఓటేశాక.. దీనిని ఒక ప్రత్యేక కవర్‌లో ప్రిసైడింగ్ అధికారి భద్రపరుస్తారు. ఇలా చేయటం ద్వారా ఎవరో తమ ఓటు వేసారనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక నిబంధనలు..ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications