ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీదే హవా..? మిగతా రెండూ కష్టమే??
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జోరుగా చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ రాష్ట్ర సమితిదే విజయమని సీనియర్ రాజకీయవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి 2023 డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండటంతో తెలంగాణలో ముందుగానే ఎన్నికలు నిర్వహించి, ఇక్కడ పార్టీని గెలిపించి ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని ఢీకొట్టాలని యోచిస్తున్నారు.

బీజేపీది బలుపా? వాపా?
ఎమ్మెల్యేలమీద వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నివేదిక అందడంతో దాదాపుగా వారిని మార్చడం ఖాయమైపోయింది. కొత్తవారితోపాటు సీనియర్ నేతలు కలిసికట్టుగా పోటీచేస్తే విజయం సాధ్యమేనని కేసీఆర్ భావిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్‌తో హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత గంభీరమైన ప్రకటనలకే పరిమితమైంది. బీజేపీకి టీఆర్ఎస్‌ను ఢీకొట్టగలిగే సత్తా ఉందా? అని విశ్లేషిస్తే కష్టమనే అభిప్రాయం వినవస్తోంది. కేవలం మతాన్ని నమ్ముకొని మాత్రమే తెలంగాణలో బీజేపీ రాజకీయం చేస్తోందని, రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగానే ఉంటుందని, వారెవరూ బీజేపీకి ఓటేయరని, పాత బస్తీ మినహా అందరూ టీఆర్ఎస్‌కే ఓటేస్తారని, కొన్ని ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే విశ్లేషణ ఉంది.

అంతా తానై చక్రం తిప్పుతున్న కేటీఆర్
ఇప్పటికే పార్టీలోను, ప్రభుత్వ పరంగా అత్యంత సమర్థవంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న కల్వకుంట్ల తారకరామారావుకు భవిష్యత్తులో కూడా తిరుగుండదని భావిస్తున్నారు. అంతా తానై చక్రం తిప్పుతున్న కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్ కూడా టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. దాదాపుగా టీఆర్ఎస్‌ను ఆ పార్టీ ఢీ అంటే ఢీ అంటోంది. కానీ పార్టీలోని సీనియర్ల నుంచి రేవంత్‌కు ప్రోత్సాహం అందకపోవడం ఆ పార్టీని నిరాశ పరిచే అంశంగా మారనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ గుంపగుత్తగా దక్కించుకోబోతోంది.

ముక్కోణపు పోరులో టీఆర్ ఎస్‌కే లాభం?
ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్, బీజేపీ చీల్చుకోబోతున్నాయి. దీంతో టీఆర్ఎస్ విజయం సులువవుతోంది. బీజేపీ ఎన్ని ఆర్భాటపు ప్రకటనలు చేసినా, ఢిల్లీ నుంచి నేతలంతా వచ్చి ఇక్కడ మకాం వేసినా తెలంగాణమీద దండయాత్రకు వస్తున్నారంటూ టీఆర్ ఎస్ ఒక ప్రకటన చేస్తే ప్రజల్లోకి వెళుతుందని, సెంటిమెంట్‌తో ముడిపడిన ప్రజల భావోద్వేగాలు తెలంగాణ రాష్ట్రసమితికి కలిసివస్తాయంటున్నారు. గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు రాకపోయినా అధికారం చేజిక్కించుకోవడం ఖాయమనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications