తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఢిల్లీలో మాట్లాడిన డీకే శివకుమార్
DK Shivakumar: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజుకో మలుపు తీసుకుంటోన్నాయి. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ స్పష్టంగా కనిపిస్తోంది. సీఎల్పీ భేటీ, సీల్డ్ కవర్, పార్టీ అధిష్ఠానం, ఢిల్లీ నుంచి పిలుపు.. అచ్చంగా కర్ణాటక తరహా వాతావరణం నెలకొందిక్కడ.
తొలుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తలొచ్చాయి. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయని, మంత్రివర్గం కూడా సిద్ధమైందనే సమాచారం గుప్పుమంది.

అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ముఖ్యమంత్రి ఎంపికపై ఎటూ తేలట్లేదు. ఈ వ్యవహారం కొలిక్కి రావట్లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో. ఆయన తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన నాయకుడు కావడమే దీనికి కారణం అనేది బహిరంగ రహస్యం.
ఎప్పటి నుంచో పార్టీ కోసం పని చేస్తోన్న తమను కాదని కొత్తగా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానాన్ని అప్పగించడానికి సీనియర్లెవరూ సిద్ధపడట్లేదు. మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్.. వంటి వారు రేవంత్‌కు పట్టం కట్టాలనుకోవడాన్ని స్వాగతించట్లేదు.

అనూహ్యంగా తలెత్తిన ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు హస్తినకు షిఫ్ట్ అయ్యాయి. సీఎల్పీ భేటీకి పార్టీ పరిశీలకులుగా హాజరైన కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాకరే.. ఈ ఉదయం ఢిల్లీలో దిగారు. పార్టీ అధిష్ఠానాన్ని కలవనున్నారు.
ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు డీకే శివకుమార్. తెలంగాణ సీఎల్పీ భేటీ సారాంశాన్ని పార్టీ అధిష్ఠానానికి వివరించడానికే తాను ఢిల్లీ వచ్చానని, ఏకవాక్య తీర్మానం గురించి వారికి వివరిస్తానని అన్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఇంకాస్సేపట్లో తాను ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేను కలుస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications