కాంగ్రెస్ లో కాబోయే సీఎం ఆయనేనా - హైకమాండ్ సంకేతాలు..!!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఖాయమా. ఎగ్జిట్ పోల్స్ అదే స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం ఇంకా ఆశల్లో కనిపిస్తోంది. బీజేపీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాబోయే సీఎం ఎవరు. రేవంత్ కు ఛాన్స్ ఉందా. సీనియర్లకు పట్టం కడతారా. సామాజిక సమీకరణాల్లో కలిసొచ్చేదెవరికి. కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం ఆశిస్తున్న వారు లాబీయింగ్ కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అయితే, హైకమాండ్ సంకేతాలు మాత్రం క్లియర్ గా ఉన్నాయని తెలుస్తోంది.
సీఎం అయ్యేది ఎవరు
తెలంగాణాలో కొత్త ముఖ్యమంత్రి ఎవరినేది ఇప్పుడు చర్చ మొదలైంది. కాంగ్రెస్ గెలుపు పైన తొలి నుంచి అంచనాలు ఉన్నా..ఎగ్జిట్ పోల్స్ మరింత మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అవుతారనేది ఇప్పుడు ప్రజల్లో ఆసక్తిగా మారుతోంది. కాంగ్రెస్ నుంచి పలువురు సీఎం రేసులో ఉన్నారు. ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి.

బీజేపీ అందరి అంచనాలను మించి సీట్లు దక్కించుకుంటుందనే లెక్కలు ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ బీజేపీ. దీంతో, బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం..ఎస్సీ వర్గీకరణ తో పాటుగా యువత బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపారానేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నివేదికలు అందాయి. దీంతో, సీఎం అభ్యర్ది విషయంలో సమర్దత..విధేయత..సామాజిక కోణం కీలకంగా మారుతోంది.
రేసులో కీలక నేతలు
కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉండటంతో...ఇప్పుడు అధికారం దక్కితే.. దీని వేడి కొనసాగిస్తూ లోక్ సభ సీట్లలో లబ్ది పొందేలా కాంగ్రెస్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీని సామాజిక సమీకరణాల్లో ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలకే ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.
దీంతో, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని..ఈ నెల 9న ప్రమాణ స్వీకారం ఉంటుందనే చర్చ ఆసక్తిగా మారుతోంది. అయితే, బీఆర్ఎస్..బీజేపీకి వచ్చే సీట్లు..పార్టీతో పాటుగా పాలన సమర్ధవంగా నిర్వహించే సామర్ధ్యం ఉన్న నేతకే పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుందనేది స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేస్తారనేది పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తున్న విశ్లేషణ.
హైకమాండ్ మూడ్ క్లియర్
బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో లాభం కలగకుండా బీసీ లేదా ఎస్సీ వర్గానికి సీఎం పదవి ఇచ్చి...రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారనేది మరో అంచనా. తిరిగి రెండున్నారేళ్ల తరువాత రెడ్డి వర్గానికి సీఎం పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా అండగా నిలిచిందని ఆ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది.
దీంతో...ముందుగా రెడ్డి వర్గానికి చెందిన నేతకే సీఎం పదవి వరిస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. దీంతో..రేవంత్ సీఎం రేసులో తొలి వరుసలో ఉన్నారు. రేవంత్ కు పాలనా వ్యవహారాలపైన అనుభవం లేకపోవటం మైనస్ అవుతుందా అనే సందేహం ఉంది. అయితే, పార్టీ హైకమాండ్ ఎవరికి సీఎం పదవి ఇచ్చినా ఆమోదిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..హైకమాండ్ తీసుకొనే నిర్ణయం పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications