దశాబ్ది ఉత్సవాల వేళ - అందరి చూపు తెలంగాణ వైపే..!!
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం..కేవలం తొమ్మిదేండ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో దూసుకుపోతున్నది. దశాబ్ది వేడుకల వేళ అందరి చూపు తెలంగాణ వైపే. మునుపెన్నడూ ఎరుగని రీతిలో 'తెలంగాణ మోడల్' పాలన ఆకర్షిస్తోంది. తెలంగాణ ఉద్యమ సారధిగా.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొత్త రికార్డులు సృష్టించారు. నేటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది.
తొమ్మిదేళ్ల పాలనలో:2014, జూన్ 2 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో అగ్రగామిగా నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి. వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికం, ఐటీ, ఆర్థిక ప్రగతి.. ఇలా ప్రతిరంగం విజయాన్నీ ప్రతిబింబించేలా ఈ రోజున తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం..ప్రజల భాగస్వామ్యంతో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

అభివృద్ధికి పట్టం:ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భంగా పేర్కొన్నారు. సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కేసీఆర్ సాగు నీటి రంగం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీటి అవసరాలను తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు చేపట్టింది. మిషన్ కాకతీయ లక్ష్యం ట్యాంక్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను పునరుద్ధరించడం. మిషన్ భగీరథ లక్ష్యం రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయడం.వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు సమాజానికి మద్దతుగా రైతు బీమా, రైతు బంధు పథకాలు అమల్లోకి వచ్చాయి. తొలి విడత పాలనలో సాధించిన విజయాలతో 2018లో అంతకుమించిన మెజార్టీతో మరోసారి కేసీఆర్ కు సీఎంగా తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు.
సంక్షేమ రంగంలో:కేసీఆర్ సంక్షేమ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వృత్తిపరమైన, కులపరమైన పథకాలు కూడా ప్రవేశపెట్టింది. బీడీ కార్మికులు (వీరిలో ఎక్కువ మంది మహిళలు), చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, ముతరాసి, బెస్త, గంగపుత్రుల కోసం చేపల పంపిణీ పథకాలు, హిందు, ముస్లిం మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టింది. ఒక రూపాయికి కిలో బియ్యం పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు 'ఆసరా' పేరుతో పింఛను వంటి ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టింది. ఆర్థికాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి.

పెరిగిన హైదరాబాద్ ఇమేజ్ :హైదరాబాద్ మూలంగా ఐటీ రంగానికి ప్రాధాన్యమిస్తూ, పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడే ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలను వివిధ జిల్లాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు ప్రవేశ పెట్టారు. షెడ్యూల్ కులాలవారికి సాధికారత సాధించే దిశలో ఆర్థిక సహాయం అందించడం దీని ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. విశ్వనగరం గా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం..వైట్ హౌస్ లాంటి సచివాలయం.. సిద్దమవుతున్న అమరవీరుల స్థూపం..మెట్రో విస్తరణ.. నగరంలో ఎక్కడిక్కడ ఫ్లై ఓవర్లు..వేగంగా విస్తరిస్తున్న ఓఆర్ఆర్ వంటివి నగర ప్రతిష్టను పెంచాయి. 24 గంటల విద్యుత్.. మంచి నీరు పాలకుల సంకల్ప బలాన్ని చాటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏకబిగిన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కేసీఆర్ నేటితో కొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications