కాంగ్రెస్ గత 60 ఏళ్లలో చేయలేనిది.. మేం చేస్తున్నాం..!
జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపరాు. ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం గొప్ప నిర్ణయమన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ .. బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ సర్కారు పక్కకు పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

2011 జనగణనలో కులగణనను చేర్చాలని సుష్మాస్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఏ సామాజిక వర్గం వెనకబడి ఉందో గుర్తించవచ్చని చెప్పారు. వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలను రూపొందించేందుకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.
కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకొంటోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాంటప్పుడు కాంగ్రెస్ గత 60 ఏళ్లలో కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇది రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డికి భయపడి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాంగ్రెస్‌లా ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మోసం చేయమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్ తూతూమంత్రంగా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిజమైన కులగణన కాదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణన పేరుతో స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపాయన్నారు. కానీ, ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు.
జనాభా లెక్కలతోపాటు కులగణన
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తదుపరి జనాభా లెక్కలను నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాక, జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీన్ని చేర్చుతామని కేంద్రం పేర్కొంది.
ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. కాగా, 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగని విషయం తెలిసిందే. కులగణన మాత్రం జరగలేదు.












Click it and Unblock the Notifications