ప్రియుడితో మాట్లాడొద్దు అన్నాడని.. షాకయ్యేలా క్రిమినల్ పెళ్ళాం క్రైం!
ఒకప్పుడు భార్యలను భర్తలు హత మార్చేవారు. ఎక్కడ ప్రధాన వార్తల్లో చూసిన భార్యను చంపిన భర్త అన్నది హెడ్డింగ్ గా కనిపించేది. కానీ ప్రస్తుతం ఆ ధోరణి మారిపోయింది. భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి తమకు అడ్డు వస్తున్నారని భర్తలను కడతేరుస్తున్న భార్యల సంఖ్య సమాజంలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
ప్రియుడితో సంబంధం వద్దన్నందుకు భర్తను కడతేర్చిన ఇల్లాలు
ఇటీవల షిల్లాంగ్ లోనూ, మహబూబ్ నగర్ లోనూ జరిగిన దారుణ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియుడు కోసం కట్టుకున్న భర్తలను అతి కిరాతకంగా చంపించిన ఈ క్రిమినల్ పెళ్ళాల ఘటనలు మర్చిపోకముందే తాజాగా మరొక సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో జరిగిన ఈ ఘటనలో ప్రియుడితో మాట్లాడొద్దు అని చెప్పినందుకు భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసింది.

ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరణ
ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు భర్త హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా రామకృష్ణయ్య పల్లికి చెందిన అంజిలప్పతో రాధా అనే మహిళకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వారు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మాణసంస్థలో కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అంజిలప్ప ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరు మున్నీరుగా వినిపించి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేసింది.
అనుమానంతో ఫిర్యాదు .. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
అయితే అంజిలప్ప గొంతుపై మరకలు ఉండడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చి రాధను ప్రశ్నించి, ఆమెపై అనుమానంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక ఆమెను విచారించిన పోలీసులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా రాధ ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందని, అయితే అటువంటివి చేయొద్దని భర్త రాధను మందలించాడని, అతనితో ఫోన్లో మాట్లాడొద్దని చెప్పాడని తెలిసింది.
మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసిన భార్య
తనకు తన ప్రియుడికి అడ్డ వస్తున్నందుకు రాధ భర్తను చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి భర్తను హత్య చేసిన రాధ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఫైనల్ గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో క్రిమినల్ పెళ్ళాం చేసిన క్రైమ్ కథ బయటపడింది. దీంతో రాధను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications