అక్రమ సంబంధం: ప్రియుడ్ని పెళ్లి చేసుకోమన్న భర్త, ఐనా చంపేసింది
హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసిన మహిళను హైదరాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చీరాల వడ్డి సంగానికి చెందిన సత్యనారాయణ తన అక్క కూతురు భావనను ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి 2009లో పెళ్లి చేసుకున్నాడు.
వారికి ఓ కొడుకు ఉన్నాడు. సత్యనారాయణ బట్టల వ్యాపారం చేసేవాడు. నష్టాలు రావడంతో ఇద్దరు కూడా చిత్తూరు జిల్లాలోని తిరుపతికి వెళ్లిపోయారు. బీటెక్ చదివిన భావన తిరుపతికి చెందిన కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్యా గొడవలు వచ్చాయి.
సత్యనారాయణ మూడు నెలల క్రితం భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్ వచ్చి మణికొండలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. గొడవలు మాత్రం తగ్గలేదు. తనకు విడాకులు ఇచ్చి కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని భావనకు సత్యనారాయణ సూచించాడు. భావన ఇదే విషయాన్ని ప్రియుడు కుమార్‌కు చెప్పింది.

అయితే, నీ భర్త సత్యనారాయణను అడ్డు తొలగిస్తేనే వివాహం చేసుకుంటానని అతను భావనకు చెప్పాడు. ఈ నేపథ్యంలో భావన తన భర్తను హత్య చేసేందుకు పథకం పన్నింది. ఈ నెల 15న తనకు తెలిసిన తన్వీర్ అనే హిందూపురం వాసిని మణికొండకు రప్పించింది.
ఆ రోజు రాత్రి భర్తకు బాగా మద్యం తాగించింది. మత్తులో ఉన్నప్పుడు కొట్టి, గొంతును నొక్కి చంపేశారు. తన్వీర్ చేతులు పట్టుకోగా కర్రతో భర్త గొంతును భావన బలంగా నొక్కి చంపింది. తర్వాత సత్యనారాయణకు ఆరోగ్యం బాగాలేదని, అతిగా మద్యం తాగుతాడని నమ్మబలికింది. పోలీసులు కేసును విచారణ జరిపి, కూపీలాగి భావననే హత్య చేసినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications