Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్‌కు సవాల్: విజయదశమికి తొలి దశ ‘డబుల్’ సాధ్యమేనా?

రెండు పడకల ఇళ్ల కి మూడుసార్లు టెండర్‌ ప్రకటనలు జారీచేసినా స్పందన కానరాక నాల్గోసారి టెండర్లను పిలిచారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడానికి కారణమన్న విమర్శలు వినిపిస్త

హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల టెండర్లు ఎప్పుడు ఏ శాఖలో పిలిచినా దక్కించుకోవాలని ఆరాటపడే కాంట్రాక్టర్లు రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి మాత్రం ముందుకు రావడం లేదు. మట్టి పనులు, ప్రాజెక్టుల పనుల్లో లాగా ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు లభించే అవకాశాలే లేకపోవటమే దీనికి కారణం. రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి మూడుసార్లు టెండర్‌ ప్రకటనలు జారీచేసినా స్పందన కానరాక నాల్గోసారి టెండర్లను పిలిచారు.

దీనికి తోడు గత నెల నుంచి అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల్లో ఇదొకటి. మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ - భూపాల్ పల్లి, మహబూబాబాద్, ఖమ్మం, ఆసిఫాబాద్ - కుమ్రభీం జిల్లాల పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. నిర్దేశిత లక్ష్యాలకు సుదూరంగా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 70 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణ పనుల్లో టెండర్ల ప్రక్రియనే పూర్తి కాలేదు. దసరాకు మరో 30 రోజులే సమయం ఉండడంతో లబ్ధిదారులు ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మహబూబ్‌నగర్‌ మినహా ఎక్కడా దసరాకల్లా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో మహబూబ్‌నగర్‌ జిల్లా ముందు ఉన్నది. ఇక నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ - గద్వాల జిల్లాలు వెనకబడ్డాయి.

జీఎస్టీతో తడిసిమోపెడైన నిర్మాణ వ్యయం

జీఎస్టీతో తడిసిమోపెడైన నిర్మాణ వ్యయం

మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఇప్పటికే 310 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో 1,498 ఇళ్ల నిర్మాణ పనులు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. మొత్తం 9,617 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. నాగర్‌కర్నూల్‌లో 6,200 ఇళ్లకు 300 ఇళ్ల నిర్మాణ పనులకు మాత్రమే టెండర్ ప్రక్రియ పూర్తయినా పనుల ప్రారంభం కాలేదు. వనపర్తిలో 2,629 ఇళ్లకు 45 మాత్రమే ప్రగతిలో ఉన్నాయి. గద్వాల జిల్లాలో 2800కి 70 ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. సుమారు 80 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దసరా నాటికి లబ్ధిదారులకు రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని పాలకుల హామీలు ప్రకటనలుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 21,246 ఇళ్లు నిర్మించాల్సి మరి. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మౌలిక వసతులతో కలిపి రూ.6.35 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక హాల్‌, రెండు పడక గదులు, వంటగది, అనుసంధాన బాత్‌రూంతో ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించనున్నది.

కానీ ఇటీవల వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ద్వారా ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ముడి సరకు ధరలు పెరిగాయి. 5 నుంచి 12 శాతం వరకు ధరలు పెరిగాయి. ఇళ్ల నిర్మాణానికి ముందుకొస్తే నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. గద్వాల జిల్లాలోనే 355 ఇళ్లకు నాలుగుసార్లు టెండర్లు పిలువగా.. ఒక్కరూ ముందుకు రాలేదు. మిగతా జిల్లాల్లో సైతం రెండు, మూడుసార్లు టెండర్లను పిలిస్తే గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. దీంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాదికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వడం అనుమానమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మే 19న ఎమ్మెల్యేలు, గృహనిర్మాణ సంస్థ, పంచాయతీరాజ్‌ అధికారులతో కలిసి సమీక్షించినా పురోగతి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

పంచాయతీరాజ్‌, గృహనిర్మాణ సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదని ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి వద్ద బహిరంగంగానే విమర్శించారు. పనులను వేగిరం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుత్తేదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తామని, సిమెంటు ధరల్లోనూ తగ్గింపు ఉండేలా చూస్తామని ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో హామీ అమలు కావడం లేదు. వస్తువుల ధరలు 5 నుంచి 12 శాతానికి పెరగడంతో నిర్మాణ వ్యయం మరింత భారంగా మారింది. ప్రభుత్వం అందించే రూ.6.35 లక్షలతో ఇళ్లు నిర్మించడం కష్టంగా ఉండడం, బిల్లుల చెల్లింపుల్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లడం కత్తిమీద సామే.

వనపర్తిలో 45 ఇళ్ల నిర్మాణంలో మాత్రమే పురోగతి

వనపర్తిలో 45 ఇళ్ల నిర్మాణంలో మాత్రమే పురోగతి

మహబూబ్‌నగర్‌లో 2015-16, 2016-17లకు ప్రభుత్వం మొత్తం 9,617 ఇళ్లు కేటాయించింది. ఇందులో 8,937 ఇళ్లకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. 310 ఇళ్లు పూర్తి కాగా 1,498 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం పరిధిలో దివిటిపల్లి, ఆదర్శనగర్‌లో దసరా నాటికి ఇళ్లు పూర్తి చేసుకొని లబ్ధిదారులకు అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దేవరకద్రలోని నిజాలాపూర్‌లో 20, జడ్చర్లలోని ఎర్రగుట్టకాలనీలో 144 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లో పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి. వనపర్తి జిల్లాకు 2015-16కు 569 ఇళ్లు మంజూరు కాగా, కేవలం 45 ఇళ్లు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. వనపర్తి నియోజకవర్గానికి 240 మంజూరు కాగా.. ఖిల్లాగణపురం మండలం కర్నెతండాలో 25, దేవరకద్ర నియోజకవర్గానికి 80 ఇళ్లు మంజూరు కాగా.. కొత్తకోట మండలంలోని మిరాసిపల్లిలో 20 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. మక్తల్‌ నియోజకవర్గానికి 80, వనపర్తి పట్టణానికి 160 ఇళ్లు మంజూరైనా టెండర్ల ప్రక్రియలోనే ఉన్నాయి. జిల్లాకు 2016-17కుగాను 2060 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఎలాంటి పురోగతి లేదు.

జోగుళాంబ - గద్వాల జిల్లాలో పూర్తే కాని టెండర్లు

జోగుళాంబ - గద్వాల జిల్లాలో పూర్తే కాని టెండర్లు

నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు ఒక్కోదానికి (2015-16లో 400, 2016-17లో 1000) 1400 చొప్పున 5600 ఇళ్లు మంజూరయ్యాయి. నాగర్‌కర్నూలుకు అదనంగా మరో 600 ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. మొత్తం 6,200 ఇళ్లను నిర్మించాలి. ఇందులో 607 ఇళ్లకు టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. నాగర్‌కర్నూలు, ఇంద్రకల్‌, పెద్దముద్దునూరు, కొల్లాపూరులో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 192 ఇళ్ల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గద్వాల జిల్లాలో 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల పరిధిలో 2800 ఇళ్లకు అనుమతి వచ్చింది. అలంపూర్‌లో 180, గద్వాలలో 220 ఇళ్లకు టెండర్లకు పిలువగా.. 45 ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులు ముందుకొచ్చారు. మిగతా 355 ఇళ్ల నిర్మాణానికి నాలుగుసార్లు టెండర్లు పిలిచిన ఒక్కరూ రాలేదు. ఇక్కడా గుత్తేదారులు రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. మిగతా ఇళ్ల నిర్మాణ పనులు టెండర్ల ఆహ్వాన దశలోనే ఉన్నాయి.

ఐదు జిల్లాల్లో పనుల పూర్తికి స్థలం కొరత

ఐదు జిల్లాల్లో పనుల పూర్తికి స్థలం కొరత

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. వచ్చే విజయదశమి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 1433, జనగామలో 1865 , వరంగల్‌ అర్బన్‌లో 2659, వరంగల్‌ రూరల్‌లో 1605, జయశంకర్‌ భూపాలపల్లిలో 6106 చొప్పున ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. అయిదు జిల్లాల్లో పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల టెండర్లు పూర్తికాలేదు. పూరైన కొద్ది పాటి ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పనులను వేగవంతం చేయాలని అధికారులు నిత్యం ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఒకవేళ టెండర్ల ప్రక్రియ పూర్తయినా స్థలాల గుర్తింపు అధికారులకు తలనొప్పిగామారింది. గ్రామాల్లో అనువైన స్థలాలు లభించడం లేదు. ఉన్న స్థలాలు కాస్తులో ఉన్నాయి. వాటి జోలికి వెళ్లాలంటే అధికారులు ఆలోచిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా అధికారులకు కత్తిమీద సాములా మారింది. పల్లెల్లో గ్రామసభ పెట్టి లబ్ధిదారుల జాబితాలు చదివి వినిపిస్తున్నారు. తమ కులానికి తక్కువగా కేటాయించారని, అనర్హులను ఎంపిక చేశారని పలువురు పేర్కొన్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో టెండర్లు పూర్తయి, లబ్దిదారుల ఎంపికైనా, స్థలం లభించినా.. మరి కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధుల్లో ఒక్కో ఇంటికి వ్యయ భారం పెరిగి సుమారు రూ. 50 నుంచి రూ.లక్ష వరకు నష్టం వస్తుందని భావిస్తున్నారు.

జయశంకర్ - భూపాలపల్లిలో కేవలం 107 ఇళ్ల నిర్మాణం మొదలు

జయశంకర్ - భూపాలపల్లిలో కేవలం 107 ఇళ్ల నిర్మాణం మొదలు

మహబూబాబాద్‌ జిల్లాకు ప్రభుత్వం 1433 ఇళ్లను మంజూరు చేస్తే 1086 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇందులో 309 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డోర్నకల్‌ నియోజకవర్గానికి 400 ఇళ్లను కేటాయించగా 218 పనులకు టెండర్లు పూర్తి చేశారు. 168 పనులు జరుగుతున్నాయి. మహబూబాబాద్‌ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేస్తే 350 టెండర్లు పూర్తి కాగా 21 ఇళ్ల పనులు మాత్రమే మొదలయ్యాయి. పాలకుర్తిలోని తొర్రూరు, పెద్దవంగర మండలాలకు 429 ఇళ్లను కేటాయించగా 358 టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు.

ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండలానికి 160 ఇళ్లను కేటాయిస్తే 160 టెండర్లు పూర్తవ్వగా 120 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దసరా నాటికి 60 ఇళ్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ములుగులోని కొత్తగూడ, గంగారం మండలాలకు 44 ఇళ్లను కేటాయిస్తే ఇంకా టెండర్లు పూర్తికాలేదు. జయశంకర్‌ - భూపాలపల్లి జిల్లాకు అత్యధికంగా 6106 ఇళ్లు మంజూరు కాగా 4,564 టెండర్లు పూర్తయ్యాయి. 892 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా కేవలం 107 నిర్మాణాలు పూర్తయ్యాయి. మంగపేట మండలం మల్లూరులో నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి.. భారీగా టెండర్లు పూర్తయినా నిర్మాణ పనులకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

జనగామలో సమస్యగా కాంట్రాక్టర్ల కొరత, స్థల సేకరణ

జనగామలో సమస్యగా కాంట్రాక్టర్ల కొరత, స్థల సేకరణ


వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు 2659 ఇళ్లు మంజూరు కాగా 2,259 నిర్మాణాలకు టెండర్లు పూర్తయినా.. చేపట్టిన కొన్ని ఇళ్ల నిర్మాణం కూడా నత్తనడకన సాగుతున్నది. చాలా చోట్ల పనులు ప్రారంభం కాక లబ్ధిదారులు నిరాశగా ఉన్నారు. వరంగల్‌ రూరల్ జిల్లాకు సుమారు 1605 ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 805 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. పనులు ఎక్కడా కూడా ప్రారంభం కాలేదు. నర్సంపేటలో వెయ్యి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. సుమారు 22 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా టెండర్లు పిలువలేదు. మిగతా చోట్ల స్థలం గుర్తింపుతో పాటు గుత్తేదారుల కొరత సమస్య ఉంది. జనగామ జిల్లాకు 1865 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 996 నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తిలో 270 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. మిగతా చోట్ల పునాది రాయి పడలేదు. కాంట్రాక్టర్ల కొరత, అనువైన స్థల సేకరణ సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు.

నిర్మాణ పనుల్లో నాసిరకం అని ఆరోపణలు

నిర్మాణ పనుల్లో నాసిరకం అని ఆరోపణలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో నాసిరకం ఇసుక, సిమెంట్‌ వాడుతుండటంతో ఫిల్లర్లు మెట్ల స్లాబ్‌ నిర్మాణ దశలోనే కుప్పకూలాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండిలో తొలివిడతలో 20ఇండ్లు మంజూరు కాగా ఒక్కో ఇంటికి రూ.5.50లక్షల చొప్పున రూ.1.10కోట్ల వరకు ప్రభుత్వం కేటాయించింది. ఇండ్ల నిర్మాణ పనులను అధికార పార్టీ టీఆర్ఎస్ నేత ఒకరు కాంట్రాక్ట్ అందుకున్నారు. 20ఇండ్లలో ఒకటి పూర్తవగా మిగతా వాటికి పిల్లర్‌ లెవల్‌ పూర్తైంది. ప్రస్తుతం స్లాబ్‌ పనులు నడుస్తున్నాయి. కాగా ఈ నెల 3న కూలీలు పనిచేస్తుండగా ఫిల్లర్‌, మెట్ల స్లాబ్‌ కూలుతుండడం గమనించి పక్కకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరిద్దరికి స్వల్ప గాయాలు కాగా వారిని తక్షణమే అక్కడ నుంచి పంపేశారు. ఇది గమనించిన స్థానికులు నాసిరకంగా ఇండ్లు నిర్మిస్తే తామెలా బతకడం? అని ప్రశ్నించారు. ఈ విషయం మీడియా పరిశీలించగా పలు అంశాలు వెలుగు చూశాయి.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడని నిలదీసిన ఎమ్మెల్యే సండ్ర

అధికారుల పర్యవేక్షణ ఎక్కడని నిలదీసిన ఎమ్మెల్యే సండ్ర

ఇసుకలో మట్టి శాతం ఎక్కువ ఉండటం వల్ల పిల్లర్లు కూలినట్టు తెలుస్తోంది. ఓ ఇంటికి స్లాబ్‌ వేసిన తర్వాత పరిశీలించగా పిల్లర్లకు క్రాక్‌ వచ్చి కూలిపోయే దశకు చేరుకున్నాయి. ప్రతి ఇంటికీ ఆరు పిల్లర్లు ఉండాల్సి ఉండగా మధ్యలో వేసిన పిల్లర్‌ను భూమిలో నుంచి కాకుండా బేస్‌మెంట్‌ పైనే నిర్మించారు. ఇటీవల పడిన వర్షాలకు కింద మట్టి కొట్టుకుపోయి బీమ్‌ కుంగి పోవడంతో ఇటుకలు పేర్చి అమర్చారు. అంతేగాక స్లాబ్‌ వేయడానికి 55నుంచి 60 కట్టల సిమెంట్‌కు బదులు బీమ్‌లకు 20కట్టలు, స్లాబ్‌లకు 20కట్టల సిమెంట్‌తోనే సరిపెట్టారు. ఒక్కో సిమెంట్‌ కట్టకు 7తట్టల కంకర, 7తట్టల ఇసుక కలపాల్సి ఉండగా 10 తట్టల ఇసుక, 10తట్టల కంకర కలిపి నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిసింది. పిల్లర్‌కు, స్లాబ్‌కు 12-18మిల్లీ మీటర్ల ఇనుము ఉపయోగించాల్సి ఉండగా 6-12మిల్లీమీటర్ల క్వాలిటీ లేని ఇనుమును వినియోగిస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించే ఇంజినీరింగ్ అధికారులే కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నాణ్యత లేని ఇటుక, సిమెంట్‌, ఇసుక ఉపయోగిస్తున్నా అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు.

కుమ్రం భీం జిల్లా పరిధిలో 23,238 కుటుంబాలకు ఇళ్ల లేమి

కుమ్రం భీం జిల్లా పరిధిలో 23,238 కుటుంబాలకు ఇళ్ల లేమి

రాష్ట్రంలోనే అత్యల్పంగా నివాస గ్రుహాలు ఉన్న జిల్లా అసిఫాబాద్ - కుమ్రంభీం. ఈ జిల్లా పరిధిలో బలంగా గాలి వీస్తే లేచిపోయే రేకుల ఇండ్లు, తడకలతో నిర్మించుకున్న గూనల ఇండ్లు, గడ్డిపై కప్పుగా వేసుకున్న పూరిపాకలు ప్రజల నివాస ఇళ్లు. నిలువ నీడ లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకం వల్ల గృహయోగం దక్కుతుందేమోనని ఆశలు చిగురించాయి. చివరికి మూడేళ్లయినా ఒక్కరికి సొంతింటి కల సాకారం కాకపోవడంతో ప్రజలు ఊసూరుమంటున్నారు. జిల్లాలో 5.15 లక్షల మంది జనాభాకు గూడు లేని నిరుపేదల కుటుంబాలు 23,238 ఉన్నాయి. 8381 కుటుంబాలు పూరి పాకల్లోనే నివాసం ఉంటున్నారు.

అంకెల్లో మాత్రం జిల్లాకు 1050 ఇళ్లు మంజూరైతే 11 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో అసిఫాబాద్ - కుమ్రం భీం జిల్లా వెనుకబడి ఉన్నదని అర్థమవుతున్నది. గమ్మత్తేమిటంటే రెండు పడక గదుల పథకానికి 9000 దరఖాస్తులు వచ్చాయి. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌-టి నియోజకవర్గాల పరిధిలో 400 చొప్పున గృహాలు మంజూరయ్యాయి. వీటితో పాటు అదనంగా ఆసిఫాబాద్‌కు 250 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జిల్లాలో 29 గ్రామాల్లో నిర్మించనున్నారు. పలుమార్లు టెండర్లు వేసినా గుత్తేదారులు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాకు రూ.40.32 కోట్లు ఈ గృహాల నిర్మాణానికి కేటాయించారు. జైనూరు మండలానికి 40 రెండు పడకల గృహాలు మంజూరు కాగా, ఆరు మాసాల కింద పదకొండు గృహాల పనులు ప్రారంభించారు. ఈ పనులు సైతం పునాదులను దాటడం లేదు. జిల్లాలో మరేక్కడా పనులు మొదలుకాలేదు.

నిబంధనలు సడలించినా నో అన్న కాంట్రాక్టర్లు

నిబంధనలు సడలించినా నో అన్న కాంట్రాక్టర్లు

రాష్ట్రంలో రెండు పడక గదుల గృహాల నిర్మాణంలో అసిఫాబాద్ - కుమ్రం భీం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. ఇళ్లను నిర్మించే క్రమంలో పలు నిబంధనలను ప్రభుత్వం సడలించినా, నిర్దేశించిన ధరకు నిర్మాణాలను పూర్తి చేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. దీంతో రెండు పడక గదుల పథకం జిల్లాలో అడుగు ముందకు పడటం లేదు. ఉచిత ఇసుకతో పాటు, సిమెంటు ధరలో ఒక్కో సంచికి రూ.140 చొప్పున తగ్గించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు కేటాయించింది. సీనరేజీ, కార్మిక పన్ను, నాణ్యత విభాగానికి చెల్లించే ఈఎండీ 2.5 శాతం (దాదాపు రూ.40 వేలు) నుంచి 0.5 శాతానికి తగ్గించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలో అభివృద్ధి పనులకు ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షలు ఖర్చు చేయాలి. రూ.15 వేలు విద్యుత్తు పనులకు, మిగతా రూ.1.10 లక్షలతో నీటి సరఫరా, మురుగు కాలువల నిర్మాణం, అనుసంధాన రహదారులను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తే తమకు గిట్టుబాటు కాదనే కారణంతో కాంట్రాక్టర్లు పనుల నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. సిర్పూర్‌ మండలంలో 25 నిర్మాణాలకు, ఆసిఫాబాద్‌లో 16, రెబ్బెన 30 నిర్మాణాలకు టెండర్‌ అయిపోయి ఒప్పందం చేశామని పంచాయతీ రాజ్ ఈఈ వెంకట్రావు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే నిర్మాణాలు చేపడతామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+