కోవర్టు రాజకీయాలకు పాల్పడితే నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాం.!క్రమశిక్షణ తప్పితే సహంచబోమన్న రాహుల్.!
వరంగల్/హైదరాబాద్: వరంగల్ రైతు సంఘర్షణ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఛీఫ్ రాహుల్ గాంధీ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి కాస్త కఠినంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇతర పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే క్షమించేదిలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేసారు. రాహుల్ గాంధీ హిందీ ప్రసంగాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలుగులో అనువాదించారు. సుధీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ వైఖరిలో ఈ సారి కొంత మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ మాటల్లో కొంత కరకుదనం, కఠినత్వం కూడా కనిపించింది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంకితభావంతో పనిచేయని నేతలకు రాహుల్ చురకలంటించారు.

కాంగ్రెస్ పార్టీ కండువా మాటున ఇతర పార్టీలతో సన్నిహితంగా ఉండే నేతలు బహిరంగంగా వెళ్లిపోవచ్చని, వారి కోసం కాంగ్రెస్ పార్టీలో తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయన్నారు రాహుల్ గాంధీ. గతంలో తెలంగాణ బహిరంగ సభల్లో చేసిన ప్రసంగానికి పూర్తి భిన్నంగా ప్రసంగించారు రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క వ్యక్తికోసమో ఇవ్వలేదని, లక్షలాది ప్రజల ఆకంక్షలను గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలని నిశ్చయించుకుందని, ఆ నిర్ణయాన్ని తాను కూడా బలపరిచానని రాహుల్ గుర్తు చేసారు. ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా ముందుకు వెళ్లలేకపోతుందన్నారు రాహుల్ గాంధీ. పార్టీ కోసం కృతనిశ్ఛయంతో పనిచేయనివారు, అంకిత భావం లేని వారు, కోవర్టు రాజకీయాలకు పాల్పడేవారు ఉంటే వారిని బహిష్కరించడానికి పార్టీ వెనకాడబోదని వరంగల్ రైతు సంఘర్షణ సభ సాక్షిగా రాహుల్ గాంధీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications