బాయిల్డ్ రైస్ కొనుగోలుపై తేల్చేసిన కేంద్రం: తెలంగాణ సర్కారు అంగీకరించిందని ప్రకటన
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మహాధర్నా కొనసాగుతుండగానే.. తెలంగాణలో బియ్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పార్ బాయిల్డ్ బియ్యం తీసుకోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడించింది.
ప్రస్తుతం రబీ పంట సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, రబీ ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని తెలిపింది. వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామని చెప్పింది. ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉందని, గత నిర్ణయాల ప్రకరామే ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరించామని తెలిపింది.

ఇకపై బాయిల్డ్ రైస్ కొనమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. వరి, గోధుమ తక్కువగా పండించాలని కోరుతున్నామని తెలిపింది. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిల్వలు ఉన్నాయని, ఇంకా నిల్వ చేసే పరిస్థితి లేదని పేర్కొంది. దేశీయ అవసరాలు, ఎగుమతుల మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఎగుమతి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఎగుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని కేంద్రం తెలిపింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా పండించాలని, అన్ని రాష్ట్రాలకు అదే సూచిస్తున్నామని తెలిపింది. రాష్ట్రాలు సేకరించగలిగేంత వరకే పరిమితం కావాలని పేర్కొంది.
గతంలో తెలంగాణ నుంచి 60 లక్షల టన్నుల ధాన్యం, 40 లక్షల టన్నుల బియ్యం సెకరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రాస్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాతే ధాన్యం, బియ్యం సేకరణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేసింది కేంద్రం. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించిందంటూ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్ వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని ఇప్పటికే తెలంగాణకు చెప్పామని.. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించిందని స్పష్టం చేసింది.
కాగా, సీఎం కేసీఆర్ రాసిన లేఖపై స్పందించిన కేంద్రం.. బాయిల్డ్ రైస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని స్పష్టం చేసింది. పంజాబ్‌లో వరి వినియోగం అంతగా ఉండదని అందుకే 90శాతం ధాన్యం సేకరిస్తున్నామని వివరించింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగవుతోందని.. పంట మార్పిడి అనివార్యమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications