తల్లికి ద్రోహమే: బిజెపిలో చేరిక వార్తలపై గుత్తా
నల్లగొండ: తాను బిజెపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లేనని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. గతంలో ఇలాగే పార్టీలు మారినవారు కాలగర్భంలో కలిసిపోయారని గుత్తా వ్యాఖ్యానించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలపై ఆయన ప్రతిస్పందించారు.
అధికారుల బదిలీల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారని గుత్తా ఆరోపించారు. వాటర్ గ్రిడ్‌లు కుంభకోణాలకు దారి తీస్తాయని ఆయన విమర్శించారు. పైప్‌లైన్ల కంపెనీలను పోషించేందుకే వాటర్ గ్రిడ్ పథకం అని గుత్తా అన్నారు. కుంభకోణాల కోసమే దగ్గర నీటిని వదిలి, వాటర్ గ్రిడ్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ ప్రతినిధులు అధికారులను బెదిరిస్తున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చెబుతున్న అవినీతి రహిత పాలనపై భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. అధికారుల బదిలీల్లో రూ.లక్షలు చేతులు మారింది నిజమా కాదా అని గుత్తా ప్రశ్నించారు.
నల్గొండకు సాగర్ నుంచి నీరివ్వకుండా శ్రీశైలం నీరు తెస్తామనడం పైపుల కంపెనీల కోసం కాదా అని ఆయన నిలదీశారు. కేసీఆర్ తన పతనానికి తానే శ్రీకారం చుట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమంటే రాజరికానికి నాందిపలకడమే విమర్శించారు. వలస నేతలు కాలగర్భంలో కలిసిపోతారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications