మందుబాబులకు బిగ్ షాక్.. నేటి నుంచి వైన్ షాపులు బంద్..!
తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో "పంచాయతీ పోరు"కి రంగం సిద్దమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, దాదాపు 37 వేల వార్డులకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం కనబడుతోంది.
ఈ క్రమంలోనే ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో నేడు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. ఈ నిషేధం డిసెంబర్ 11న పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న మండలాల్లోని ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ మద్యం నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలోని ఆయా ఎన్నికల ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లతో సహా, అలాగే మద్యం విక్రయించే ఇతర లైసెన్స్డ్ సంస్థలకు కూడా వర్తిస్తాయి.

మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా.. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు. ఇదే తరహాలో రెండవ విడత, మూడవ విడత ఎన్నికలకు కూడా మద్యం నిషేధాన్ని అమలు చేస్తారు.
కాగా రెండవ విడత ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన.. చివరి విడత ఎన్నికలు డిసెంబర్ 17వ తేదీన జరగనున్నాయి. ఈ మూడు విడతల ఎన్నికలకు సంబంధించి అధికారులు, ఆయా జిల్లా ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుని.. నిషేధ సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలు లేదా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుంది.












Click it and Unblock the Notifications