Khairathabad Ganesh: గణేశుడి దర్శనానికి వెళ్లి.. క్యూలైన్లో మహిళ ప్రసవం!
Khairathabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 'శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి వేడుకలతో కోలాహలంగా ఉన్న ఖైరతాబాద్ గణేష్ మండపం ప్రాంగణంలో బుధవారం ఓ అద్భుతం జరిగింది. భారీ వర్షాలు మధ్య క్యూలో నిలబడి ఉన్న ఒక గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో తోటి భక్తులు తక్షణమే స్పందించి ఆమెకు సహాయం చేసి తల్లీ బిడ్డలను కాపాడారు. మానవత్వానికి, సహాయ గుణానికి ఈ ఘటన నిలువుటద్దంలా నిలిచిది.
ఈ అసాధారణ సంఘటన ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన ఒక మహిళ భర్తతో కలిసి గణేష్ దర్శనం కోసం ఉదయం నుంచే క్యూలో ఉన్నారు. ఈ క్రమంల ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పలు రావడంతో తోటి భక్తులు పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. భక్తులంతా కలిసి ఆమెను పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి సురక్షితంగా ప్రసవం జరిగేలా చూశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. తోటి భక్తుల సమయస్ఫూర్తి, సహాయంతో ఆ మహిళ సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలోనే తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావడంతో ఆ తల్లి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ గణనాథుడి రూపంలో తమకు ఒక కుమారుడు జన్మించాడని.. ఇది ఆ దేవదేవుడి అనుగ్రహమని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
పండల్ వద్ద గవర్నర్ తొలి పూజ
ఇదే సమయంలో మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఖైరతాబాద్ గణేష్ పండల్‌ను సందర్శించారు. 69 అడుగుల ఎత్తు ఉన్న పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహానికి ఆయన తొలి పూజ నిర్వహించారు. ఈ పూజలో ఆయనతో పాటు అధికారులు, భక్తులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా దర్శనమిచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకున్నాడు. గణేశుడికి ఇరువైపులా పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముడు సహా లక్ష్మీసమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామదేవతగా ఆరాధించే గజ్జెలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దారు. క్యూలైన్లో నిల్చున్న భక్తుల్లో నిండు గర్భిణి ప్రసవించిన సంఘటన ఒక పండుగ వాతావరణంలో, తోటివారికి సహాయం చేయాలనే భావన ఎంత ముఖ్యమో చాటిచెప్పింది. భక్తులు తమ భక్తిని ప్రదర్శించడంతో పాటు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడడం ద్వారా నిజమైన మానవత్వాన్ని చాటారు.












Click it and Unblock the Notifications