భర్తతో గొడవ పడి భార్య అదృశ్యం: రైలు పట్టాలపై విద్యార్థిని మృతదేహం
హైదరాబాద్: ఓ మహిళ భర్తతో గొడవ పడి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లిందీ తెలియడం లేదు. ఈ సంఘటన హైదరాబాదులోని బహదూర్‌పురా పోలీసు స్టేషన్‌లో చోటు చేసుకుంది. కిషన్‌బాగ్ నందిముస్లాయిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ యాకూబ్ మజానీ, ఆస్రా పర్వీన్ దంపతులు.
వారిది ఉమ్మడి కుటుంబం. యాకూబ్ మజానీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా వేరు కాపురం పెడదామంటూ అస్రా పర్వీన్ భర్తతో గొడవ పడుతోంది. ఈ స్థితిలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు.

దాంతో కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులను ఆరా తీశారు. ఆమె కోసం పలు చోట్ల గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో యాకూబ్ మజానీ శుక్రవారంనాడు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాదులోని మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారంనాడు ఓ ఇంటర్మీడియట్ విద్యార్తిని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
శవం వద్ద లభించిన ఐడి కార్డును బట్టి రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బిజెఆర్ నగర్‌కు చందిన నవ్యగా మృతురాలిని గుర్తించారు. ఈసిఐఎల్ శ్రీచైతన్య కళాశాలలో ఆమె ఇంటర్మీడియట్ చదువుతోంది.
తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్, శోభారణి దంపతుల పెద్ద కూతురు నవ్య (17). శుక్రవారం ఉదయం చిన్న విషయంపై తల్లి ఆమెను మందలించింది. ఆ తర్వాత కళాశాలకు వెళ్తున్నానని ఉదయం 11 గంటల సమయంలో బయలుదేరి మల్కాజిగిరి - లాలా గుడా రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications