మహిళా టెక్కీలతో భద్రతపై కమిటీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, అయితే మహిళలకు ఎలాంటి భద్రతను కల్పించాలనే అంశంపై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నామని మహిళా భద్రతా కమిషన్ చైర్‌పర్సన్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఈ నెల 20 లోపు నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో కమిటీ సభ్యులు అన్ని రంగాల మహిళలతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని టాటా కన్స్‌ల్టెన్సీలోని ఆడిటోరియంలో ఐటీ ఉద్యోగినులతో ఆమె సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శైలజారామయ్య, సంక్షేమ శాఖ సెక్రటరీ సునీల్‌శర్మ, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సౌమ్యమిశ్రా, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ క్రైం జానకీషర్మిల, టీఎస్‌ఎస్ మహిళ హెచ్‌ఆర్ మమతతో పాటు వందమంది ఐటీ ఉద్యోగినులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు.

మహిళా టెక్కీల సూచన
పోలీస్ స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లు ఉండే విధంగా చూడాలని, వీధి దీపాలు, హెల్ప్ లైన్ సెంటర్లు, ఆటోడ్రైవర్లకు ప్రత్యేక స్టిక్కర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని మహిళా టెక్కీలు పూనం మాలకొండయ్య కమిటీ సభ్యులకు చెప్పారు.

సుశిక్షితులైన క్యాబ్ డ్రైవర్లు
సుశిక్షితులైన క్యాబ్ డ్రైవర్లను నియమించడం, ఫోన్ స్విమ్‌కార్డు ఆధారంగా మొబైల్ ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకొనే సాఫ్ట్‌వేర్ రూపొందించడం వంటివి చేయాలని కూడా మహిళా టెక్కీలు చెప్పారు.

ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్
ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్ సిస్టమ్ రూపొందించడం వంటి సూచనలను మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు ఈ సమావేశంలో కమిటీకి తెలిపారు.

75 వేల మంది మహిళలు
దాదాపు 75 వేల మంది మహిళా ఉద్యోగులు ఐటి కారిడార్‌లో పనిచేస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. ఇక్కడ పలు మార్గాల్లో వీధి దీపాలు సేవని తమ దృష్టికి వచ్చిందని ఆమె చెప్పారు.

బస్సుల సంఖ్య పెంచాలి
బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు కోరినట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమావేశమైనట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications