ఒక దెబ్బకు రెండు పిట్టలు: అందరి దృష్టీ సోనియా గాంధీ వైపే: ఏం చేయబోతోన్నారు..!!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభలో ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో టేబుల్ చేశారు. నేడు దీనిపై వాడివేడిగా చర్చ సాగబోతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టింది. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే ఈ బిల్లు చాలాసార్లు సభ ముందుకు వచ్చినప్పటికీ.. దాన్ని ఆమోదింపజేసుకోలేకపోయామని, తగినంత మెజారిటీ అప్పట్లో అధికార పక్షానికి లేదనేది కేంద్రం వాదన.

ఈ వాదన ద్వారా- బిల్లును కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు పలుమార్లు అడ్డుకున్నాయనే విషయాన్ని అధికార బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి జనంలోకి తీసుకెళ్తోంది. ఈ అంశాన్ని పదే పదే గుర్తు చేస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదనే అభిప్రాయం ప్రజలకు కలిగేలా వ్యూహాత్మక వైఖరిని అనుసరిస్తోంది బీజేపీ.
ఇప్పుడు అదే బిల్లును ఆమోదింపజేసుకునే అవకాశం తమకు లభించిందని, సభలొ సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ సారి అది సాధ్యపడుతుందని కేంద్రం చెబుతోంది. 2024లో జరగబోయే ఎన్నికల్లోనూ బీజేపీ- ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీని ఇవ్వాలనే సందేశాన్ని కూడా పంపించినట్టయింది.
ప్రతిపక్షాలను మరింత బలహీనపర్చడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సంపూర్ణ మెజారిటీని సాధించుకోవడం.. ఈ కీలక బిల్లు ద్వారా సాధ్యపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహాన్ని రచించింది. దీన్ని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎలా ఛేదిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ప్రతిపక్షాలు ఎలా తిప్పి కొట్టగలుగుతాయనేది నేటి చర్చలో తేలిపోనుంది. కాంగ్రెస్ తరఫున జరిగే డిబేట్స్‌కు ఆ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ సారథ్యాన్ని వహించనున్నారు. మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు సోనియా గాంధీ లేరు. ఆ అపవాదును కూడా తుడిచి పెట్టేలా కాంగ్రెస్ ఎలా బీజేపీ-ఎన్డీఏ వ్యూహాన్ని ఎదుర్కొనగలుగుతుందనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications