ఇల వైకుంఠపురంగా యాదాద్రి!!
ఈరోజు కామిక ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాలలో అనేక ఆలయాలలో ప్రముఖులు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటున్నారు. నేడు తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి గడ్కరీ దంపతులు దర్శించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి రోజా, యాంకర్ శ్రీముఖితో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికా పర్యటన ముగించుకుని తెలంగాణకు వచ్చిన వెంటనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈ రోజు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చిన మంత్రి, ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా, తమ సతీమణి శ్రీమతి ఉషా దయాకర్ రావుతో కలిసి యాదగిరిగుట్టకి చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల వైకుంఠపురంగా యాదాద్రి వెలిసిందని, సీఎం కెసిఆర్ గారి కృషి వల్ల భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన అన్నారు.

తిరుమల తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ ఆలయాల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు.
చరిత్రలో న భూతో న భవిష్యతి అన్న చందంగా సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించారని చెప్పారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాదాద్రి దేవాలయం అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

కెసిఆర్ సీఎంగా వచ్చిన తర్వాతే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కామిక ఏకాదశి నాడు ఏ కోరికలు కోరుకున్న తీరుతాయని, అందుకే తాను సీఎం కేసీఆర్ కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామి ని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications