రేవంత్ రెడ్డి - బండి సంజయ్ కు వైఎస్ షర్మిల కీలక ప్రతిపాదన..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బీఆర్ఎస్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. ఇందుకోసం వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చొరవ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం..నిరుద్యోగుల అంశం పైన ఉమ్మడి పోరాటానికి ప్రతిపాదన చేసారు.
ఈ మేరకు కాంగ్రెస్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి - బండి సంజయ్ కు షర్మిల ఫోన్ చేసారు. ఇద్దరి నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో..ఉమ్మడి కార్యచరణ ఖరారు దిశగా అడుగులు వేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కు వైఎస్ షర్మిల ఫోన్ చేసారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని ఇద్దరు నేతలకు ప్రతిపాదించారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని సూచించారు. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని కోరారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వరని తెలిపారు.
ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. షర్మిల ప్రతిపాదనకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సమావేశమవుదామని చెప్పారు. రేవంత్ మాత్రం ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో, రేవంత్ స్పష్టత ఇచ్చిన తరువాత ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షాలకు ఇదే తరహాలో షర్మిల లేఖ రాసారు. ప్రభుత్వం పై వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుదామని ప్రతిపాదించారు. కానీ, ఏ పార్టీ ముందుకు రాలేదు. ఇప్పుడు నిరుద్యోగ అంశం పైన షర్మిల రెండు ప్రధాన పార్టీల నేతలకు ఫోన్ చేసారు.
పేపర్ లీకేజ్ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గతంలోనే నిరుద్యోగుల సంబంధిత అంశాల పైన షర్మిల దీక్షలు చేసారు. ఇప్పుడు షర్మిల ప్రతిపాదన చేసిన విధంగా కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు కలిసి వస్తాయా..విపక్షాల ఉమ్మడి పోరాటం సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications