షర్మిల అరెస్ట్: ఎందుకంటే?
హైదరాబాద్: గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆదివారంనాడు బాధిత మహిళను వైఎస్ షర్మిల పరామర్శించి.. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ముందు బైఠాయించారు. ఆమెకు మద్దతుగా స్థానిక నేతలతో పాటు కొందరు మహిళలు ధర్నాకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని షర్మిలను బలవతంగా పోలీసు వాహనం ఎక్కించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సమయంలో స్వల్ప తోపులాట, లాఠీ ఛార్జ్ జరిగింది.

అర్ధరాత్రి మహిళ అని చూడకుండా స్వాతంత్య్రం వచ్చిన రోజు పోలీసులు ఈ అరాచకానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా షర్మిల మండిపడ్డారు. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే.. మనకు స్వాతంత్ర్యం వచ్చినట్లా? రానట్టా? అని ప్రశ్నించారు.
రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడితే స్వాతంత్య్రాన్ని గౌరవించినట్లా? అని షర్మిల మండిపడ్డారు. బాధితురాలికి 120 గజాల స్థలం ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారట.. కానీ, ఆ విషయం బహిరంగంగా ఎందుకు చెప్పలేదని షర్మిల ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు.. మహిళపై ఇంత దారుణమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమన్నారు.
ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా ఒక మహిళపై థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారని షర్మిల ప్రశ్నించారు. బాధితురాలికి వెంటనే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, షర్మిల ధర్నా కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో వైఎస్ షర్మిలతోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత లోటస్ పాండ్‌లోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు.

'గిరిజన మహిళపై ఈ అరాచకానికి పాల్పడిన ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? బాధిత మహిళ పై దాడి చేసిన వారిని కాకుండా ఎవరో ఇద్దరు కానిస్టేబుళ్లని ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు మీకు ఎక్కడిది? గిరిజన మహిళ లక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మేం చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య' అని షర్మిల ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
VIDEO | Ruckus ensued between YSR Telangana party workers and state police in Hyderabad as party leader YS Sharmila held a protest regarding the alleged assault of a tribal woman by police personnel. pic.twitter.com/YEMj4pBunG
— Press Trust of India (@PTI_News) August 20, 2023
కేసీఆర్ కు పరిపాలన చేతకాలేదు కానీ మమ్మల్ని అరెస్ట్ చేయడం చేతనైంది. పోలీస్ డిపార్ట్మెంట్ , ప్రభుత్వం ఈ మహిళకు ఎలా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలి. తక్షణమే నిందితుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, బాధిత మహిళకు రూ.25 లక్షల నష్టపరిహారం మరియు 120 గజాల భూమి ఇస్తామని హామీ ఇస్తూ బహిరంగంగా ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ గిరిజన మహిళకు న్యాయం చేయకపోతే ప్రజలే కేసిఆర్ కు తగిన గుణపాఠం చెప్తారని షర్మిల హెచ్చరించారు.












Click it and Unblock the Notifications