kcr ఇలాకాలో ys sharmila గర్జన -కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం -నిరుద్యోగం, modi పథకంపైనా
తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు వైయస్ షర్మిల. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆమె ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించి, ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. కొత్త పార్టీ ప్రయత్నాలు ఆరంభించినప్పటి నుంచి షర్మిల ఫోకస్ చేస్తోన్న నిరుద్యోగ సమస్యపై మరోసారి గళం విప్పారు. ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం కేసీఆర్ సొంత ఇలాఖాలో షర్మిల పర్యటన ఆసక్తికరంగా సాగింది..

వెంకటేశ్ కుటుంబానికి పరామర్శ..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత షర్మిల ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామానికి వెళ్లిన షర్మిల.. ఇటీవలే ఆత్మ హత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపానికి గురై మే16న వెంకటేశ్ ఆత్మహత్య చేసుకుడు. వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

7 ఏళ్లలో దరిదాపుల్లోకీ రాలేదు
"ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు.. ఇవ్వాళ అవే ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లో నిరుద్యోగులు చావే దిక్కు అనుకుంటున్నారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానం. 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారు. వయసు పెరిగిపోవడంతో ఉద్యోగాలు రాక ఎంతో మంది చనిపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో కూడా లేవు. ఇంకా ఎంత మంది చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలి. కనీసం నిరుద్యోగ భృతిని కూడా సరిగా ఇవ్వడంలేదు. సీఎం ఛాతిలో ఉన్నది గుండెనా, బండనా? వెంటనే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం'' అని షర్మిల అన్నారు.

మోదీ పథకాన్ని తిట్టిన నోరేనా..
ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా తూప్రాన్ మండలం నాగుల పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా షర్మిల పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలుపై రైతులతో మాట్లాడారు. ''రైతు బందు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే.. పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించాలె. సకాలంలో ధాన్యం కొంటలేరు.. ధాన్యం కొన్నా సకాలం లో డబ్బులు ఇస్తలేరు'' అని రైతులు తమ సమస్యల్ని షర్మిలతో చెప్పారు.
రైతులను ఆమె ఓదార్చి, ధరల కోసం పోరాడుతామని మాటిచ్చారు. కరోనా వేళ పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేసిన షర్మిల.. మోదీ సర్కారువారి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దిక్కుమాలిందిగా తిట్టిపోసిన కేసీఆర్.. మళ్లీ ఆ పథకంలోనే ఎలా చేరుతారని షర్మిల ప్రశ్నించారు. ఇటీవల కరోనాతో ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబాలను షర్మిల పరామర్శించి, వారికి సాయం అందించారు.