షర్మిల తన జన్మదినం నాడే - పోరాటం కొనసాగింపు : పాదయాత్ర రాజకీయంగా నిలబెట్టేనా..!!
తెలంగాణలో రాజకీయ పార్టీ ఆరంభించి.. భారీ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఈనెల 17 నుంచి తిరిగి ప్రారంభించేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సమయాత్తమవుతున్నారు. డిసెంబర్ 17 షర్మిల జన్మదినం. అదే రోజు నుంచి తిరిగి తన పాదయాత్ర కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేసారు. అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర 21 రోజులపాటు 238 కిలోమీటర్ల మేర సాగింది.

ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి మొదలు
దాదాపుగా ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాలను షర్మిల సందర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో గత నెల 11న నల్గగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెంలో ఆమె పాదయాత్రకు విరామం ఇచ్చారు. మళ్లీ అక్కడి నుంచే యాత్రను కొనసాగించనున్నట్లు పాదయాత్ర కోఆర్డినేటర్ చంద్రహాసన్ రెడ్డి తెలిపారు. కోడ్ అనంతరం చేపట్టబోయే పాదయాత్ర ద్వారా ధాన్యం కొనుగోలుపై షర్మిల ప్రజా ఉద్యమాన్ని చేపడతారన్నారు. ముఖ్యం గా యాసంగిలో ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేంత వరకు పోరాడతామని చెప్పారు.

కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తామంటూ
అయితే, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం సహకారం తీసుకుంటున్న షర్మిల పార్టీ.. తొలి విడత ప్రజా యాత్ర చేసిన 21 రోజుల ఫీడ్ బ్యాక్ పైన అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పుడు రాజకీయంగా టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఫలితం తరువాత వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేయటం ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతలు సైతం కౌంటర్ ఇస్తున్నా... అధికార టీఆర్ఎస్ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటం కంటే..బీజేపీని డామేజ్ చేయటానికి ఎక్కువగా ప్రయత్నిస్తుందనే వాదన ఉంది.

తెలంగాణలో మారుతున్న సమీకరణాలు
ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం ఈ అంశంలో తాము వెనుకబడలేదనే విధంగా ముందుకొస్తోంది. దీంతో..ఈ సమయంలో రాజకీయంగా షర్మిల వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం గుర్తించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. కీలక నేతలు ఎవరూ పార్టీలోకి రాలేదు. ఇక, టీఆర్ఎస్ ను ఎదుర్కొనేది బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినా.. ఆ పార్టీకి ఇప్పుడు టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ సైతం సవాల్ గా మారుతోంది.
Recommended Video

షర్మిల పాదయాత్రనే నమ్ముకుంటున్నారా
తెలంగాణలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్యన..ఇప్పుడు షర్మిల చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర ఏ మేర పార్టీకి రాజకీయంగా లాభిస్తుందనే చర్చ మొదలైంది. దీంతో..పాదయాత్ర సాగిస్తూనే.. ప్రభుత్వం పైన పోరాటానికి.. ప్రజా సమస్యల ప్రస్తావనకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం పాదయాత్ర ద్వారా రాకీయంగా నిలబడటం సాధ్యం కాదని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో..షర్మిల ప్రారంభించే మలి విడత ప్రజా ప్రస్థానంలో ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications